హర.. హర.. మహాదేవ శంభోశంకర

7 Aug, 2018 12:54 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా శివ దీక్ష చేపట్టిన బోల్‌భం భక్తులు జిల్లాలోని ఆయా శివాలయాలకు తరలిపోతున్నారు. శివనామస్మరణతో హోరెత్తిస్తూ  భక్తిశ్రద్ధలతో శివాలయాలను దర్శించుకుంటున్నారు. తమ వెంట తీసుకువచ్చిన పుణ్య నదీ జలాలతో శివునికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు.

రాయగడ ఒరిస్సా : శివనామస్మరణే ధ్యేయంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బోల్‌భం భక్తులు రాయగడలోని నైమగిరి పర్వత శ్రేణుల్లో ఉన్న పాతలేశ్వర శివాలయానికి సోమవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా అనేక మంది బోల్‌భం దీక్షాపరులు అక్కడున్న చాటికొన జలపాతం వద్ద పవిత్ర స్నానమాచరించారు. అనంతరం ఆయా పుణ్య నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

అనంతరం శివునికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన అనేక మంది బోల్‌భం భక్తులు తమ వెంట కావిళ్లతో తీసుకువచ్చిన పవిత్ర జలాలతో శివునికి పెద్ద ఎత్తున అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉపవాసాలు ఆచరించి, శివునికి ప్రత్యేక పూజలు చేశారు.

గత కొన్ని రోజుల నుంచి బోల్‌భం భక్తులు మార్గం మధ్యలో ఉన్న అనేక శివాలయాలను సందర్శించి, శివునికి ప్రత్యేక పూజలు చేస్తున్న విషయం తెలిసిందే. సుమారు నెల రోజుల పాటు కొనసాగే ఈ దీక్షలో భక్తులందరూ శివనామస్మరణ చేసుకుంటూ ఏక మార్గంలో ప్రయాణిస్తూ యాత్రను కొనసాగిస్తున్నట్లు పలువురు భక్తులు చెబుతున్నారు. 

జయపురంలో..

జయపురం : రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బోల్‌భం దీక్షాపరులు కొరాపుట్‌ జిల్లాలోని జయపురంలో ఉన్న గుప్తేశ్వర ఆలయానికి బయలుదేరారు. జయపురం పట్టణం నుంచి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుప్తేశ్వర ఆలయానికి వెళ్లాలంటే మార్గం మధ్యలో ఉన్న అడవులను దాటుకుంటూ వెళ్లాలి. ఈ నేపథ్యంలో రాత్రిపూట ప్రయాణం అంత సౌకర్యం కానందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా అడవిలో ఉన్న అనేక చెట్లకు విద్యుత్‌ లైట్లను పెద్ద ఎత్తున అమర్చుతున్నారు.  

పలు రాష్ట్రాల నుంచి కూడా..

ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో బోల్‌భం భక్తులు శివుని దర్శనం కోసం గుప్తేశ్వర ఆలయానికి చేరుకుంటుండడం విశేషం. ఇదే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పలు స్వచ్చంధ సంస్థలు, ప్రజా సంఘాలు, సంఘ సేవకులు బోల్‌భక్తులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న విషయం తెలిసిందే.

రాత్రి, పగలు తేడా లేకుండా అనేక వేలాది మంది బోల్‌భం భక్తులు బొయిపరిగుడ  నుంచి గుప్తేశ్వరాలయం వరకు ఉన్న దట్టమైన అడవిలో ప్రస్తుతం బోల్‌భం భక్తులు ప్రయాణం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జయపురం పట్టణానికి చెందిన యువత దారి పొడవునా దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. బోల్‌భం భక్తులు చక్కగా నడిచి వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉందని పలువురు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

బరంపురంలో..

బరంపురం: మహా శివునికి ఇష్టమైన శ్రావణమాసం సందర్భంగా దీక్ష చేపట్టిన పలువురు బోల్‌భం దీక్షాపరులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా శివాలయాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది శివభక్తులు శివనామస్మరణ చేసుకుంటూ ఆయా శివాలయాలకు చేరుకుని, భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు.

 భక్తులు వెళ్లే మార్గంలో ఎలాంటి అపశ్రుతులు జరగకుండా ఉండేలా పలు స్వచ్ఛంద సంస్థలు, సంఘ సేవకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని ఉజ్జలేశ్వరాలయానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని, తమ వెంట తీసుకువచ్చిన పవిత్ర నదీ జలాలతో శివునికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, తరించారు.

మరిన్ని వార్తలు