అదుపులోకి హరియాణా

24 Feb, 2016 03:02 IST|Sakshi

    జింద్‌లో కర్ఫ్యూ ఎత్తివేత, రోహ్‌తక్‌లో 4 గంటల పాటు
     పలు ప్రాంతాల్లో తగ్గని ఉద్రిక్తత.. రాస్తారోకోలు, ఆందోళనలు
     రోహ్‌తక్‌లో సీఎం ఖట్టర్ పర్యటన.. కాన్వాయ్‌ను ముట్టడించిన స్థానికులు


 చండీగఢ్: జాట్‌ల రిజర్వేషన్ పోరాటంతో అట్టుడుకుతున్న హరియాణాలో పరిస్థితి కాస్త తెరిపిచ్చింది. ఉద్రిక్తతలు తగ్గినా పలుచోట్ల కర్ఫ్యూ కొనసాగుతోంది. రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలి స్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో పలు చోట్ల ఆందోళనలను విరమించగా.. మరికొన్ని ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రజలు అత్యవసర వస్తువులను కొనుగోలు చేసేందుకు రోహ్‌తక్ ప్రాంతంలో 4 గంటలపాటు కర్ఫ్యూను సడలించి.. తిరిగి విధించారు. జింద్ జిల్లాలో కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేశారు. హిస్సార్, హన్సి, భివానిలలో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. కాగా, సీఎం ఖట్టర్ రోహ్‌తక్‌లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులు సీఎం కాన్వాయ్‌ను ముట్టడించారు. పట్టణంలో విధ్వంసం సృష్టించినవారిని, లూటీలకు పాల్పడినవారిని పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు.

 తొలగిన అడ్డంకులు..
 రహదారుల దిగ్బంధాన్ని ఆందోళనకారులు విరమించుకోవటంతో.. ప్రయాణికులు, నిత్యావసర వస్తువుల రవాణాకు కాస్తంత ఉపశమనం లభించింది. అంబాలా-ఢిల్లీ హైవేపై పానిపట్ వరకూ మార్గంపై అడ్డంకులు తొలగిపోయాయి. రైలు మార్గాలపై ధర్నాలను కూడా ఆందోళనకారులు విరమించారు.

 రిజర్వేషన్‌పై కమిటీ భేటీ
 జాట్ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ.. మంగళవారం హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశమైంది. కోటా అమలుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించింది. మరోవైపు, పంజాబ్-హరియాణా హైకోర్టు కూడా జాట్‌ల ఆందోళనకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని వచ్చే సోమవారంలోగా వివరించాలని హరియాణా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు