మరణించినా.. హీరోగా మారాడు!

23 Dec, 2015 16:41 IST|Sakshi
మరణించినా.. హీరోగా మారాడు!

ఒకవైపు మృత్యువు దూసుకొస్తోంది. ఆ విషయం విమానంలో ఉన్నవాళ్లెవరికీ తెలియదు.. పైలట్‌కు మాత్రం తెలుసు. అయినా ఎలాగోలా ఇతరుల ప్రాణాలు కాపాడాలని చివరి క్షణం వరకు ప్రయత్నించాడు. దగ్గర్లోనే ఆయిల్ ట్యాంకర్, రైల్వే ట్రాక్ ఉన్నా.. విమానం వాటి మీదకు పడకుండా దూరంగా చెట్ల మీద పడేలా చూశాడు. బీఎస్ఎఫ్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఆ పైలట్.. హీరోగా నిలిచాడు.

సూపర్ కింగ్ బి200 విమాన ప్రమాదంలో 10 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది మరణించిన ఘటనలో పైలట్.. నష్టాన్ని తగ్గించేందుకు తీవ్రంగా కృషిచేశాడు. టేకాఫ్ తర్వాత కొన్ని సెకన్లకే విమానంలో ఒక ఇంజన్ ఫెయిల్ అవ్వడాన్ని గుర్తించిన అతడు.. విమానాశ్రయం సరిహద్దు గోడ దగ్గర ఉన్న  చెట్టుపై పడేలా చేసి భారీ నష్టాన్ని తగ్గించాడు. ఉదయం బయలుదేరిన క్షణంలోనే పైలట్ కెప్టెన్ భగవతి ప్రసాద్ ఇంజన్‌లో సమస్య ఉందని గ్రహించాడు. ఇంతలోనే కూలిపోతున్న పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించి భారీ నష్టాన్ని నియంత్రించగలిగాడు. కానీ కేవలం 60 సెకన్లలోనే పైలట్ ప్రసాద్, కో పైలట్ రాజ్ దేశ్ సహా పదిమంది బీఎస్ఎఫ్ సిబ్బంది జీవితాలు ఆహుతైపోయాయి.

ప్రమాదం జరుగుతోందని తెలిసినా సిబ్బందిని రక్షించే సమయం లేకపోయింది. ఇంజన్‌లో సాంకేతిక లోపం రావడంతో నేలపై పడబోయిన విమానాన్ని 180 డిగ్రీల్లో యు టర్న్ తీసుకొన్నాడు. భారీనష్టం వాటిల్లకుండా చూసేందుకు పైలట్ తీవ్రంగా ప్రయత్నించి, విమానాన్ని బలవంతంగా చెట్టుకు గుద్దించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విమానంలో సాంకేతిక లోపం వచ్చిందని గమనించగానే పైలట్ ఏటీసీ అనుమతితో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడని కొందరు అధికారులు, ఇతర ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు