హిమాచల్‌లో మినీబస్సు లోయలో పడి 21 మంది మృతి

27 Sep, 2013 22:34 IST|Sakshi

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ముగ్గురు మహిళలతో పాటు మినీబస్సులో ఉన్న మొత్తం 21 మంది మృత్యువాత పడ్డారు. ఉచ్చా టక్కర్‌ నుంచి రేణుక వెళ్తున్న మినీ బస్సు సిర్మౌర్‌ జిల్లాలోని రన్సువా-జబ్‌రోగ్‌ గ్రామం వద్ద ఇరుకైన లోయలోకి 600 అడుగులు దొర్లుకుంటూ వెళ్లి పడిపోయింది. బస్సు మొత్తం ముక్కలు ముక్కలుగా విడిపోగా బస్సు శకలాల్లో చిక్కుకుపోయిన కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి.

 

డ్రైవర్‌, కండక్టర్‌ సహా 19 మంది ఘటనా స్థలంలోనే మరణించగా తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి దదౌ ఆస్పత్రిలో మరణించారు. మరో 15 ఏళ్ల బాలుడు సంజయ్‌ను చండీగఢ్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం పట్ల ఆ రాష్ట్ర గవర్నర్‌ ఊర్మిళాసింగ్‌, ముఖ్యమంత్రి వీర్‌భద్రసింగ్‌లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
 

మరిన్ని వార్తలు