పోలీస్‌ బలగాలకు జై

2 Feb, 2018 05:40 IST|Sakshi

హోంశాఖకు రూ.92,679 కోట్లు గతంలో పోలిస్

దాదాపు 10.5 శాతం పెంపు

పోలీస్‌ బలగాలకే రూ.62.741 కోట్లు

న్యూఢిల్లీ: పారామిలిటరీ బలగాల బలోపేతమే లక్ష్యంగా ఈ సంవత్సరం (2018–19) కేంద్ర బడ్జెట్‌లో హోంశాఖకు నిధుల కేటాయింపు జరిగింది. ఈ సారి రూ.92,679.86 కోట్లను కేటాయించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 10.5 శాతం అదనం. గత సంవత్సరం (2017–18)లో రూ.83.823.30 కోట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం కేటాయింపుల్లో సగానికిపైగా పారామిలిటరీ దళాలకే వెచ్చించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు.

దేశ రాజధాని ఢిల్లీ పోలీసుల కోసం రూ.6,946.28 కోట్లు, సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 1,750 కోట్లు కేటాయించారు. భారత్‌–పాక్, భారత్‌–చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మేరకు కేటాయింపులు జరిపినట్లు మంత్రి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేసే కేంద్ర పోలీస్‌ బలగాల(సీఆర్‌పీఎఫ్‌)కు రూ.20,268 కోట్లు కేటాయించారు. అలాగే భారత్‌–పాక్, భారత్‌–బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో పనిచేస్తున్న సరిహద్దు భద్రతా దళాల కోసం ఈ సారి రూ.17,118.64 కోట్లు కేటాయించారు. జాతీయ పోలీస్‌ బలగాలకు మొత్తంగా రూ.62,741.31 కోట్లు కేటాయించారు. అలాగే ఇంటెలిజెన్సీ బ్యూరో కోసం రూ.1,876.44 కోట్లు కేటాయించారు.

మరిన్ని వార్తలు