ఎవరెస్ట్‌ ఎత్తు ఎంతో తెలుసా?

22 Jun, 2017 07:30 IST|Sakshi



కఠ్మాండు: భూతాపోన్నతి కారణంగా మంచు కరిగి హిమాలయాల ఎత్తులో మార్పు వచ్చిందా? నేపాల్‌లో 2015లో వచ్చిన పెను భూకంపం వల్ల కొండలు కుంచించుకుపోయాయా? భూమి పొరలు కదలడం వల్ల ఎత్తు మరింత పెరిగిందా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకనుంది. ప్రపంచంలోనే ఎల్తైన హిమాలయాలను కొలిపించాలని నేపాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

మొదటిసారి హిమాలయాలను 1856లో కొలిచారు. బ్రిటీష్‌ సర్వేయర్‌ సర్‌ జార్జ్‌ ఎవరెస్ట్‌ బందం దీన్ని కొలచి సముద్ర మట్టానికి 8,840 మీటర్ల ఎత్తున ఉందని తేల్చింది. ఆయన పేరుతోనే హిమాలయాల్లో ఎవరెస్ట్‌ శిఖరం అనే పేరు వచ్చింది. ఆ తర్వాత 1955లో రెండోసారి కొలచి హిమాలయాల ఎత్తును 8,848 మీటర్లుగా తేల్చారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఎత్తును ప్రమాణంగా తీసుకుంటున్నారు. కాలక్రమంలో హిమాలయాల ఎత్తులో మార్పు వచ్చినట్లు మూడు శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తున్నాయని, అందుకని ఎత్తును కొలవాల్సిన బాధ్యత నెపాల్‌కుందని నేపాల్‌ సర్వే విభాగం డైరెక్టర్‌ గణేష్‌ ప్రసాద్‌ భట్టా తెలిపారు. ఈ సర్వేకు దాదాపు 15 లక్షల డాలర్లు ఖర్చవతాయన్నది ఓ అంచనా.



నేపాల్‌లోని ఉదయపూర్‌ జిల్లాలో సముద్ర మట్టానికి దాదాపు 1500 మీటర్ల ఎత్తులో కొంతమంది సర్వేయర్లు ఎవరెస్ట్‌ను కొలవడం మొదలు పెట్టారని నేపాల్‌ అధికారులు తెలిపారు. ప్రతి రెండు కిలీమీటర్లకు ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని, ఒక్క మిల్లీమీటరు కూడా వదలకుండా కొలుస్తామని వారు చెప్పారు. జూలై మధ్యలో అధికారికంగా కొలిచే కార్యక్రమం మొదలవుతుందని, ఆగస్టు నాటికి ఊపందుకుంటుందని, దాదాపు 50 మంది సర్వేయర్లు పాల్గొంటారని వారు వివరించారు.

జీపీఎస్‌ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అమెరికా జాతీయ జియోగ్రఫిక్‌ సొసైటీ 1999లో ఎవరెస్ట్‌ ఎత్తును కొలచి 8,850 మీటర్లని తేల్చింది. అయితే సంప్రదాయక పద్ధతుల్లో ఎత్తును కొలవలేదన్న కారణంగా దాన్ని గుర్తించేందుకు నేపాల్‌ ప్రభుత్వం తిరస్కరించింది. 2005లో చైనా బందం సర్వే జరిపి 8,844 మీటర్లని తేల్చింది. దాన్ని కూడా గుర్తించేందుకు నేపాల్‌ తిరస్కరించింది. ఎవరెస్ట్‌ శిఖరం అధికారికంగా నేపాల్‌ భూభాగంలో ఉన్న విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు