-

నేనైతే రాజీనామా చేసి పారేసేవాడిని

28 Nov, 2016 08:17 IST|Sakshi
నేనైతే రాజీనామా చేసి పారేసేవాడిని
తానే ఇప్పుడు ఆర్థికమంత్రి అయి ఉండి, ప్రధానమంత్రి పెద్దనోట్ల రద్దుకు పట్టుబట్టి ఉంటే ఈ పాటికి రాజీనామా చేసే పారేసేవాడినని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి తనను పిలిచి, తాను 500, 1000 నోట్లను రద్దుచేయాలనుకుంటున్నానని అలా చేయొద్దని సలహా ఇచ్చేవాడినన్నారు. దానికి సంబంధించిన వాస్తవాలు, అంకెలు అన్నీ చెప్పేవాడినని, అయినా కూడా ఆయన ముందుకే వెళ్లాలనుకుంటే.. తాను రాజీనామా చేసేసేవాడినని ఆయన అన్నారు.
 
ఢిల్లీలో జరిగిన సాహిత్య ఉత్సవంలో మీడియా ఆయనను మీరే అరుణ్ జైట్లీ స్థానంలో ఆర్థికమంత్రిగా ఉంటే ఏం చేసేవారని అడిగినప్పుడు ఈ విధంగా సమాధానం చెప్పారు. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రధానమంత్రి చెబుతున్నట్లుగా అవినీతి అంతం కాదని, నకిలీనోట్ల ప్రవాహం ఆగదని, బ్లాక్ మార్కెటింగ్ కూడా ఏమాత్రం తగ్గదని ఆయన మండిపడ్డారు. ప్రజలు డిజిటల్ లావాదేవీలవైపు మొగ్గడం వల్ల తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని తెలిపారు. 
 
పెద్దనోట్ల రద్దువల్ల కలిగే ప్రభావాలపై ప్రధానమంత్రికి సరిగా చెప్పలేదని, చివరకు ప్రధాన ఆర్థిక సలహాదారుకు కూడా నోట్ల రద్దు విషయం ముందుగా తెలియదని చిదంబరం విమర్శించారు. తానైతే ముందుగా ఒక కమిటీని నియమించి ఉండేవాడినని అన్నారు. సీబీడీటీ ఇచ్చిన నివేదిక కూడా పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగానే ఉందని.. ఏ ఒక్కరూ దానికి మద్దతు పలకలేదని చెప్పారు. 1946లో ఒకసారి 1978లో  మరోసారి కూడా ఇలాంటి చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. ప్రతిపక్షాన్ని అడొగద్దు అనుకుంటే.. తన సొంత మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా సలహా అయినా తీసుకుని ఉండాల్సిందని, లేదా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను అడగొచ్చని అన్నారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలన్నారు. 
మరిన్ని వార్తలు