అడిగింది 5 వేల కోట్లు.. ఇచ్చింది 25 కోట్లు | Sakshi
Sakshi News home page

అడిగింది 5 వేల కోట్లు.. ఇచ్చింది 25 కోట్లు

Published Tue, Nov 29 2016 12:53 AM

అడిగింది 5 వేల కోట్లు.. ఇచ్చింది 25 కోట్లు - Sakshi

  • రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పట్టించుకోని ఆర్‌బీఐ
  • వెంటాడుతున్న నగదు కొరత
  • రాష్ట్రంలో రూ.35 వేల కోట్లు దాటిన డిపాజిట్లు
  • జమ చేసిన పాత నోట్లకు సగం కూడా సరిపోని కొత్త నోట్లు
  • ఉద్యోగుల జీతాలు, ఆసరా పింఛన్లకు ప్రభుత్వం తంటాలు
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల అవసరాలకు తగినన్ని కొత్త నోట్లను సరఫరా చేయటంలో ఆర్‌బీఐ దాదాపుగా చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పట్టించుకున్న దాఖలాలు కనిపించటం లేదు. రూ.5 వేల కోట్ల విలువైన రూ.500, రూ.100 నోట్లను పంపిం చాలని ప్రభుత్వం గత వారంలో ఆర్‌బీఐకి లేఖ రాసింది. అయితే ఆర్‌బీఐ ఇప్పటి వరకు కేవలం రూ.25 కోట్ల విలువైన నోట్లను పంపించి చేతులు దులుపుకుంది. అడిగిన దాంట్లో కేవలం ఐదు శాతం నోట్లను సరఫరా చేయటం, మిగతా నోట్లు ఇప్పటికిప్పుడు వచ్చేలా లేకపోవటంతో బ్యాంకర్లు సైతం తమ చేతుల్లో ఏమీ లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

    మరోవైపు రద్దయిన పెద్ద నోట్ల స్థానంలో రూ.2 వేల నోట్ల చలామణి ఎక్కువవుతున్న కొద్దీ మార్కెట్లో చిన్న నోట్ల కొరత మితిమీరుతోంది. ఇప్పటివరకు ఆర్‌బీఐ రాష్ట్రంలో రూ.13 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లను చలామణిలోకి తెచ్చింది. ఆ నోటు చిల్లరగా మార్చుకునేందుకు ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు. కొత్త రూ.500 నోట్లు అరుదుగానే దర్శనమిస్తున్నాయి. తొలి దఫాలో రూ.20 కోట్లు, రెండో దఫాలో రూ.25 కోట్ల విలువైన 500 నోట్లు మాత్రమే ఆర్‌బీఐ పంపిణీ చేసింది. దీంతో చిన్న నోట్ల కొరత రోజురోజుకూ పెరిగి పోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇప్పటివరకు ఖాతాల్లో జమ చేసిన డబ్బుతో పోలిస్తే ఆర్‌బీఐ కేటాయించిన డబ్బు అందులో సగం కూడా లేకపోవటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.

    ఈ నెల 9 నుంచి శనివారం వరకు రాష్ట్రంలో ప్రజలు వివిధ బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం రూ.35 వేల కోట్లు దాటిందని ఆర్‌బీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇదే వ్యవధిలో రాష్ట్రంలోని బ్యాంకులకు పంపిణీ చేసిన డబ్బు రూ.14 వేల కోట్లు దాటలేదని స్పష్టమవుతోంది. జమ చేసిన డబ్బుతో పోలిస్తే కేవలం 40 శాతం నోట్లు చలామణిలోకి వచ్చినట్లు లెక్కతేలుతోంది. దీంతో ప్రజలు తమ దగ్గరున్న పాత నోట్లకు సరిపడే నోట్లను తిరిగి తీసుకోలేక బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రతిరోజూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
     
    నగదు రహిత లావాదేవీలపై దృష్టి
    ప్రస్తుత ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్స హించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక నుంచి అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను ఆన్‌లైన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, మొబైల్ అప్లికేషన్ల ద్వారా జరపాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన అంశాలపై ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. విద్యుత్, నల్లా తదితర బిల్లులన్నీ ఇదే తీరుగా చెల్లింపులను ప్రోత్సహించనుంది. మీ సేవ కేంద్రాల్లో ప్రస్తుతం లావాదేవీలు నగదు రూపంలో జరుగుతున్నాయి. అక్కడ కూడా నగదు రహిత లావాదేవీలను ప్రోత్స హించనున్నారు. దశల వారీగా అన్ని ప్రభుత్వ చెల్లింపులకు నగదు రహిత విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
     
    జీతాలు, పింఛన్లకు ఎలా?
    ఒకటో తారీఖు దగ్గర పడుతుండటంతో ప్రధానంగా ఉద్యోగుల జీతాలు, ఆసరా పింఛన్ల చెల్లింపులెలా.. అని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్రంలో దాదాపు 36 లక్షల మంది ఆసరా పింఛన్‌దారులున్నారు. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.1000, వికలాంగులకు రూ.1500 చెల్లించాల్సి ఉంది. డిసెంబర్ ఒకటిన చెల్లించాల్సిన ఆసరా ఫించన్లకు సరిపడే డబ్బును ఆర్థిక శాఖ విడుదల చేసింది. బ్యాంకుల్లో ఈ సొమ్ము జమైంది. కానీ బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లు తప్ప వేరే నోట్లు లేకపోవటంతో పింఛన్లెలా చెల్లించాలనే సందేహం ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. ఇద్దరు లబ్ధిదారులకు కలిపి రూ.2 వేల నోటు ఇవ్వాలా.. డిసెంబర్ ఒకటిన ఇచ్చే పింఛన్‌ను నిలిపేసి జనవరి 1న రెండు నెలల మొత్తంగా రూ.2 వేల నోటు ఇవ్వాలా.. అని ఆలోచిస్తోంది.

    పలు జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనలపై ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు నాన్ గెజిటెడ్ ఉద్యోగులందరికీ ఒకటో తారీఖున తమ జీతంలో నుంచి రూ.10 వేలు నగదు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. బ్యాంకుల్లో ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా ఈ డబ్బు అందజేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రతిపాదనకు బ్యాంకర్ల నుంచి ఇప్పటివరకు సమ్మతి రాలేదు. బ్యాంకర్లు అంగీకరించకపోతే ఉద్యోగులకు నగదు చెల్లింపులకు ఉన్న ప్రత్యామ్నాయాలేమిటని.. ప్రభుత్వం పునరాలోచనలో పడింది. సోమవారం జరిగే కేబినెట్ భేటీలో దీనిపై చర్చించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement