పాఠ్యాంశంగా ‘అభినందన్‌’

6 Mar, 2019 04:52 IST|Sakshi

జైపూర్‌: భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ ధీరత్వం రాజస్తాన్‌ స్కూలు విద్యార్థులకు పాఠ్యాంశం కానుంది. ఆ రాష్ట్ర విద్యా మంత్రి గోవింద్‌ సింగ్‌ దోతస్రా అభినందన్‌ ధైర్యసాహసాలను పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించినట్టు ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘పాకిస్తాన్‌ సైనికులకు చిక్కి, ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా అభినందన్‌ ప్రదర్శించిన పోరాటపటిమ ప్రశంసనీయం. అది భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలి.

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను గౌరవిస్తూ ఆయన సాహసాన్ని స్కూలు సిలబస్‌లో చేర్చబోతున్నాం’ అని వెల్లడించారు. ఇటీవల పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్‌–16 విమానాన్ని కూల్చివేసి, శత్రుదేశానికి పట్టుబడి కూడా సాహసోపేతంగా వ్యవహరించిన అభినందన్‌ స్వదేశానికి సురక్షితంగా తిరిగివచ్చిన విషయం తెలిసిందే. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల గాథలను కూడా పాఠ్యాంశాలుగా చేర్చాలని ఇటీవలే రాజస్తాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని వార్తలు