సీబీఎస్ఈ ఫ‌లితాలు.. స‌మానంగా క‌వ‌ల‌ల మార్కులు

15 Jul, 2020 21:13 IST|Sakshi

నోయిడా:  ఆ క‌వ‌ల‌లిద్ద‌రూ ఒకేలా ఉండ‌ట‌మే కాదు సీబీఎస్ఈ ఫ‌లితాల్లోనూ ఒకే విధ‌మైన మార్కులు సాధించారు. ఢిల్లీ నోయిడాకు చెందిన క‌వ‌ల‌లు మాన్సి, మాన్య చూడ‌టానికి అచ్చుగుద్దిన‌ట్లు ఒకేలా క‌నిపిస్తారు. ఒకే పాఠ‌శాల‌లో చ‌ద‌వ‌డ‌మే కాదు అన్ని స‌బ్జెక్టుల్లోనూ స‌మాన మార్కులు సంపాదించి ఔరా అనిపించా‌రు. జూలై13న విడుద‌లైన సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో ఇద్ద‌రూ 95.8 శాతం స్కోరు సాధించారు. ఇంజ‌నీరింగ్ చ‌ద‌వాల‌న్న‌ది తమ క‌ల అని క‌వ‌లలు పేర్కొన్నారు. సెప్టెంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న జేఈఈ మొయిన్స్‌కు స‌మాయత్త‌మ‌వుతున్నామ‌ని వివ‌రించారు.  (సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల )

'మా ఇద్ద‌రి మ‌ధ్య ఎప్పుడూ ఆరోగ్య‌క‌ర‌మైన పోటీనే ఉంటుంది. అంతేకాకుండా మా ఇష్టాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. నాకు కెమిస్ట్రీ స‌బ్జెక్ట్‌ అంటే ఇష్టం కాగా మాన్సికి భౌతిక‌శాస్ర్తం మీద మ‌క్కువ‌. ప‌రీక్ష‌ల‌కు ఇద్ద‌రం క‌లిసే ప్రిపేర్ అయ్యాం. యాదృచ్చికంగా జ‌రిగింది కానీ ఇద్ద‌రికీ స‌మానంగా మార్కులు వ‌స్తాయ‌ని అయితే ఊహించ‌లేదు' అని  మాన్య పేర్కొంది. ఈ ఏడాది విడుద‌లైన సీబీఎస్ఈ ఫ‌లితాల్లో 88.79 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. ఇది గ‌త సంవ‌త్స‌రంతో పోలిస్తే 5.38 శాతం పెరిగింది. ఫ‌లితాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ముంద‌జ‌లో ఉన్నారు.  ఫలితాల్లో 92.15 శాతం మంది బాలికలు, 86.19 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత కంటే బాలికల ఉత్తీర్ణత 5.96 శాతం అధికం. 66.67 శాతం ట్రాన్స్‌జెండర్లు ఉత్తీర్ణులు కావడం విశేషం. 
(సీబీఎస్‌ఈ ‘12’లో బాలికలదే పైచేయి )

మరిన్ని వార్తలు