ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కోవాలి

2 Nov, 2019 05:07 IST|Sakshi
రాష్ట్రపతి భవన్‌ వద్ద జర్మన్‌ చాన్స్‌లర్‌ మెర్కెల్‌తో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

ప్రపంచ దేశాలు కదిలి రావాలన్న మోదీ, మెర్కెల్‌ 

భారత్, జర్మనీ మధ్య 17 రంగాల్లో ఒప్పందాలు  

న్యూఢిల్లీ: భారత్, జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్, ప్రధాని మోదీ మరిన్ని చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన మెర్కెల్‌  శుక్రవారం మోదీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉగ్రవాదం పీచమణచడానికి ఉమ్మడిగా పోరాటం సాగించాలని నిర్ణయించారు.

వ్యూహాత్మక భాగస్వామ్యంతో సాగే పలు రంగాలైన రక్షణ, ఇంధనం, కృత్రిమ మేధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఒక అవగాహనకు వచ్చారు. అయిదవ అంతర్‌ ప్రభుత్వ సంప్రదింపులకు (ఐజీసీ) నేతృత్వం వహించిన ఇరువురు పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలే పంపారు. ఇతర దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి తమ భూభాగాన్ని వాడుకుంటే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత జర్మనీ చాన్స్‌లర్‌తో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.  

అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయాలి : మోదీ  
నరేంద్రమోదీ, ఏంజెలా మెర్కెల్‌ చర్చలు పూర్తయ్యాక ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ దేశాలకు ఒక శాపంలా మారిన ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఇరు దేశాలు ఉమ్మడి పోరాటం చేస్తాయని, ప్రపంచ దేశాలన్నీ తమతో చేతులు కలపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయడానికి ప్రపంచదేశాలన్నీ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని, అంతర్జాతీయ చట్టాలను, మానవ హక్కుల చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అంతేకాకుండా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే ప్రాంతాలను, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను, వారి నెట్‌వర్క్‌లను, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించే సంస్థలను సర్వనాశనం చేయాలన్నారు.  జర్మనీ వంటి సాంకేతిక, ఆర్థిక పరిపుష్టి కలిగిన దేశాల సహకారంతోనే భారత నవనిర్మాణం సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఇరుదేశాలు అంతరిక్షం, పౌరవిమానయానం, విద్య, వైద్యం, కృత్రిమ మేధ, సైబర్‌ సెక్యూరిటీ వంటి 17 రంగాల్లో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఆర్థిక సహకారం మరింత బలోపేతం కావాలి : మెర్కెల్‌
5జీ, కృత్రిమ మేధ వంటి రంగాల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి ఇరు దేశాలు మరింతగా సహకరించుకోవాలని ఏంజెలా మెర్కెల్‌ అన్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కావాలన్నారు. మేకిన్‌ ఇండియా కోసం భారత్‌ చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మోదీ సర్కార్‌ ఎంత కష్టపడుతోందో తెలుస్తుందని ఆమె కొనియాడారు. భారత్‌ జర్మనీ సహకారం తీసుకోవడం హర్షణీయమని వ్యాఖ్యానించారు.  
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా