దొంగ చేతికే తాళాలు ఇవ్వనున్న బ్యాంకు!

22 Jun, 2014 10:31 IST|Sakshi
దొంగ చేతికే తాళాలు ఇవ్వనున్న బ్యాంకు!
న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాంక్ అధికారులు ఓ సాహసానికి ఒడిగట్టారు. తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తూ.. మంచి ప్రవర్తన, ఆర్హతలున్న వ్యక్తికి బ్యాంకు వ్యవహారాల్ని నిర్వహించే బాధ్యతల్ని అప్పగించారు. తీహార్ జైలులో గత కొద్ది సంవత్సరాలుగా ఇండియన్ బ్యాంక్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తొంది.
 
వంద కోట్లకు పైగా బ్యాంకు వ్యవహరాలు నమోదయ్యాయి. మా బ్యాంక్ లో తీహార్ ఖైదీకి ఉద్యోగం ఇవ్వాలంటూ ఓ ప్రతిపాదన వచ్చింది. బ్రాంచ్ కూడా ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. త్వరలోనే అధికారికంగా ఖైదీ బ్యాంక్ వ్యవహారాలను చూస్తాడు అని ఇండియన్ బ్యాంక్ ఎండీ టీఎం భాసిన్ తెలిపారు. 
 
సెమీ ఓపెన్ జైలులో ఖైదీల అర్హత, ప్రవర్తన, మానసిక, శారీరక పటుత్వాన్ని బట్టి ఫ్యూన్, సెక్యూరిటీ గార్డు, కంపూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను ఇస్తున్నామని తీహార్ జైలు అధికారి సునీల్ గుప్తా తెలిపారు. ఖైదీల వివరాలను అధికారులకు అందిస్తామని, నియామకాలపై తుది నిర్ణయం బ్యాంకు తీసుకుంటుందని జైలు అధికారులు తెలిపారు.
 
గత నెలలో 66 మంది ఖైదీలు తమ శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నారని.. జైలు ఆవరణలో జరిగిన నియామకాల ప్రక్రియలో వేదాంత గ్రూప్, తాజ్ మహల్ గ్రూప్ తోపాటు వివిధ ప్రైవేట్ కంపెనీలు ఖైదీలను ఉద్యోగులుగా ఎంపిక చేసుకున్నారని అధికారులు తెలిపారు. తీహార్ జైల్లో 8 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తూ.. ఇగ్రో నుంచి సోషల్ వర్క్ లో డిగ్రీ సాధించిన రాజు ప్రశాంత్ అనే ఖైదీకి నెలకు 35 వేల జీతంతో అసిస్టెంట్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ ఉద్యోగం లభించింది. 
మరిన్ని వార్తలు