'నా రక్తంతో రాస్తున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి'

15 Dec, 2019 12:54 IST|Sakshi

న్యూఢిల్లీ : నిర్భయ కేసులో శిక్షను అనుభవిస్తున్న దోషులను తన చేతులతో ఉరి తీసే అవకాశం ఇవ్వాలంటూ అంతర్జాతీయ షూటర్‌ వర్తిక సింగ్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు. 2012 డిసెంబర్‌ 16న అతి కిరాతకరంగా అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసిన దోషులు ప్రస్తుతం తీహార్‌ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. త్వరలోనే వీరిని ఉరి తీయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు వారిని ఉరి తీసే అవకాశం కల్పించాలని కోరుతూ వర్తిక సింగ్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రక్తంతో లేఖను రాశారు.

'ఇది నా రక్తంతో రాస్తున్నా! నిర్భయ హత్య కేసు దోషులను నా చేతులతో ఉరి తీసే అవకాశం కల్పించండి. దీనిద్వారా దేశంలో ఒక మహిళ కూడా ఉరిశిక్షను అమలు చేయగలదనే సందేశాన్ని సమాజానికి చెప్పాలనుకుంటున్నా" అని వర్తిక సింగ్ లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసు అనంతరం నిర్భయ దోషులను బహిరంగంగా ఉరి తీయాలనే డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా నిర్భయ దోషులను ఉరి తీయడానికి 10 తాళ్లను సిద్ధం చేయాలని బీహార్‌లోని బుక్సర్‌ జైలు అధికారులకు  ఆదేశాలు జారీ చేశారు. ఇంతకు ముందు 2001లో పార్లమెంటుపై ఉగ్రదాడికి పాల్పడిన అఫ్జల్‌ గురు, సీరియల్‌ కిల్లర్‌ ధనుంజయ్‌ చటర్జీ, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి యాకుబ్‌ మీనన్‌, 2008 ఉగ్రదాడిలో పాల్గొన్న అజ్మల్‌ కసబ్‌లను బుక్సర్‌ జైలు నుంచి తెప్పించిన తాళ్లతోనే ఉరి తీయడం గమనార్హం.
(చదవండి : ఉరితాళ్లు సిద్ధం చేయండి)

మరిన్ని వార్తలు