‘ఐటీ దాడులు ముగిసినట్టే’

12 Nov, 2017 18:00 IST|Sakshi

సాక్షి,చెన్నై: జైలు శిక్ష అనుభవిస్తున్న ఏఐఏడీఎంకే నేత వీకే శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌ సహా కుటుంబ సభ్యుల నివాసాలు, కార్యాలయాలు, ఆస్తులపై జరుగుతున్న ఐటీ దాడులు దాదాపు ముగిశాయని ఐటీ వర్గాలు వెల్లడించాయి. సోదాల్లో ఎంత మేర నగదు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారనే వివరాలను తెలిపేందుకు ఐటీ అధికారులు నిరాకరించారు. సోదాలు పూర్తయ్యాయని, సోదాల్లో లభించిన పత్రాలు, ఆధారాల ఆధారంగా స్టేట్‌మెంట్లను నమోదు చేసుకోవడం, సంబంధితులను ప్రశ్నించడం మిగిలిఉందని ఐటీ అధికారి ఒకరు తెలిపారు.

ఆపరేషన్‌ క్లీన్‌ మనీ కింద చేపట్టిన ఈ సోదాలు మొత్తం 187 ప్రాంతాల్లో పూర్తయిందని చెప్పారు. నవంబర్‌ 9న ప్రారంభించిన ఐటీ సోదాలు ఏకకాలంలో బెంగుళూర్‌, హైదరాబాద్‌, ఢిల్లీల్లో కొనసాగాయి. వేయి మంది అధికారులు 12 బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం నుంచి అందించిన సమాచారం సహా పలు కోణాల్లో లభించిన సమాచారం ఆధారంగా సోదాలు సాగాయని ఐటీ వర్గాలు వెల్లడించాయి.

తమిళ చానెల్‌ జయ టీవీ, దినకరన్‌ పార్మ్‌హౌస్‌ సహా శశికళ బంధువులకు చెందిన ఆస్తులపై పలు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. కాగా రాజకీయాల నుంచి తనను, శశికళను బయటకు పంపేందుకే ఐటీ సోదాల పేరుతో కుట్రకు పాల్పడుతున్నారని దినకరన్‌ ఆరోపించారు.

మరిన్ని వార్తలు