రింగింగ్ బెల్స్‌పై ఐటీ దాడులు

21 Feb, 2016 13:03 IST|Sakshi
రింగింగ్ బెల్స్‌పై ఐటీ దాడులు

న్యూఢిల్లీ: వివాదాస్పద చౌక స్మార్ట్‌ఫోన్ ‘ఫ్రీడం’ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్ కార్యకలాపాలపై ఎక్సైజ్, ఆదాయ పన్ను విభాగాలు దృష్టి సారించాయి. కంపెనీ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఐటీ విభాగం కొన్ని కీలక పత్రాలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎక్సైజ్, ఐటీ విభాగం అధికారులు వచ్చిన సంగతి వాస్తవమేనని, వారు కొన్ని మార్గదర్శకాలు సూచించారని రింగింగ్ బెల్స్ ప్రెసిడెంట్ అశోక్ చద్ధా పేర్కొన్నారు.

ఫ్రీడం బ్రాండ్ పేరిట రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ రింగింగ్ బెల్స్ ఊదరగొట్టడం, దీని సాధ్యాసాధ్యాలపై సందేహాలు వ్యక్తమవడం తెలిసిందే. మరోవైపు, ఈ చౌక స్మార్ట్‌ఫోన్ వ్యవహారంపై విచారణ చేయాలంటూ ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగం (డైటీ) కార్యదర్శి అరుణ శర్మను టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆదేశించారు. ఫ్రీడం ఫోన్ ధరపై సందేహాలు లేవనెత్తుతూ బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య రాసిన లేఖకు స్పందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫ్రీడం ఫోన్ విక్రయాలు తమపై ప్రభావం చూపబోవని మరో కంపెనీ డేటా విండ్ స్పష్టం చేసింది. ఫ్రీడమ్ 251 ఫోన్‌కి భారీ డిమాండ్ రావడంతో బుకింగ్స్‌ను నిలిపివేస్తున్నట్లు శనివారం సంస్థ ప్రకటించింది. తొలి రోజున 3.7 కోట్లు, రెండో రోజున 2.47 కోట్ల మేర రిజిస్ట్రేషన్లు జరిగాయని వివరించింది.

>
మరిన్ని వార్తలు