ముళ్లకిరీటం బాబోయ్...! | Sakshi
Sakshi News home page

ముళ్లకిరీటం బాబోయ్...!

Published Sun, Feb 21 2016 1:13 AM

ముళ్లకిరీటం బాబోయ్...! - Sakshi

విజయానికి తండ్రులెందరో... ఓటమి అనాధ అని ఓ పాత సామెత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చూసిన వారికి ఆచరణలోనే ఇది బోధపడుతోంది. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు గడ్డురోజులు మొదలయ్యాయి. రాష్ట్ర ఏర్పాటుబిల్లు ఆమోదం పొందగానే టీపీసీసీకి అధ్యక్షునిగా పొన్నాల లక్ష్మయ్యను అధిష్టానం నియమించింది. కారణాలేమైనా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తొలి ఓటమిని చవిచూసింది. దీనితో పొన్నాలను మార్చి, ఆ స్థానంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కూర్చోబెట్టింది.

అయితే టీఆర్‌ఎస్ దూకుడో, కాంగ్రెస్ గ్రహచారమో ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు పరాభవాలు ఆగలేదు. దీనితో కాంగ్రెస్‌లో సహజంగా ఉండే సంస్కృతి ప్రకారం పార్టీ నేతలపై ఫిర్యాదులు, వారిని తప్పించాలనే డిమాండ్లు తెరమీదకొచ్చాయి. తప్పించడం సులభమే కానీ ఆ తరువాత సంగతేమిటని అధిష్టానం అడుగుతున్న ప్రశ్నకు ఫిర్యాదు చేస్తున్న నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీపీసీసీకి సారధ్యం వహించడానికి భయపడిపోతున్నారట.

ఈ కష్టకాలంలో ఖర్చు పెట్టుకుని, కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించేవారికి సహజంగా ఉండే గౌరవ మర్యాద(?)లను తట్టుకుని, అన్నిస్థాయిల్లోని నేతల అవసరాలను, గాంధీభవన్ చిట్టాపద్దుల వ్యయాన్ని, ఢిల్లీ నుంచి వచ్చే పరిశీలకుల ధాటిని తట్టుకుని నిలబడాలంటే తమ శక్తి సరిపోదని చాలామంది నాయకులు పారిపోతున్నారట. ఎన్నికలకు మూడేళ్లు సమయముండగా ఇప్పుడీ ముళ్లకిరీటం ఎందుకని కాంగ్రెస్ ముఖ్యనేతలు  సున్నితంగా తప్పించుకుంటున్నారట.

Advertisement
Advertisement