‘ద వైర్‌’పై జయ్‌ షా దావా

10 Oct, 2017 03:12 IST|Sakshi

షా తరఫున వాదించనున్న ఏఎస్జీ మెహతా

ఆరోపణలపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శల దాడి

అహ్మదాబాద్‌: బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కొడుకు జయ్‌ షా ‘ద వైర్‌’ వార్తా వెబ్‌సైట్, సంపాదకులపై గుజరాత్‌లోని ఓ మెట్రోపాలిటన్‌ కోర్టులో క్రిమినల్‌ పరువునష్టం కేసు వేశారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక జయ్‌ షా ఆస్తులు 16వేల రెట్లు పెరిగాయనీ, అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించారంటూ ‘ద వైర్‌’ కథనం ప్రచురించడం తెలిసిందే. జయ్‌ షా పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి వార్తా కథనంపై విచారణకు ఆదేశించారు. ఈ కేసులో జయ్‌ షా తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్జీ) తుషార్‌ మెహతా వాదించనున్నారు.

ఇందుకోసం మెహతా న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అనుమతి కోరగా, ఆయన అందుకు పచ్చజెండా ఊపినట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. కాగా, ఆదివారం ప్రకటించినట్లు జయ్‌ షా వెబ్‌సైట్‌ సంపాదకులపై రూ.100 కోట్లకు సివిల్‌ పరువునష్టం దావా ఇంకా వేయాల్సి ఉంది. ‘ద వైర్‌’ కథనాన్ని ఆధారంగా చేసుకుని విపక్ష కాంగ్రెస్, ఆప్, వామపక్షాలు బీజేపీపై విమర్శలు చేయడం, సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని ప్రధానిని కోరడం తెలిసిందే. 

మోదీ మాట్లాడండి: రాహుల్‌ 
జయ్‌ షాపై వచ్చిన కథనంపై స్పందించాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మోదీని డిమాండ్‌ చేశారు. ‘మోదీగారూ!, మీరు వాచ్‌మన్‌గా ఉన్నారా లేక భాగస్వామిగానా?’ అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. నోట్లరద్దు వల్ల లాభపడింది జయ్‌ షా లాంటి వారేనని విమర్శించారు.  

డైపర్ల స్థాయి నుంచి ఎదగండి
కాంగ్రెస్‌ విమర్శలకు బీజేపీ తీవ్ర స్వరంతో, దీటుగా బదులిచ్చింది. ‘రాహుల్‌ అనే ఈ చిన్నపిల్లాడు ఎదగడానికి ఇష్టపడటం లేదు. డైపర్‌ నుంచి బయటకు రాలేకపోతున్నాడు. పెద్ద నోట్ల ఉపసంహరణకు ముందే జయ్‌ షా కంపెనీ మూతపడినప్పటికీ, నోట్లరద్దు వల్ల జయ్‌ కంపెనీకి లాభాలు వచ్చాయని అంటున్నారు’ అని ఉత్తరప్రదేశ్‌ ఆరోగ్య మంత్రి, ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు