వాట్సాప్‌ పోస్ట్‌తో కశ్మీర్‌ విద్యార్థినుల అరెస్ట్‌

17 Feb, 2019 13:21 IST|Sakshi

జైపూర్‌ : పుల్వామా ఉగ్రదాడిని స్వాగతిస్తూ వేడుకలు జరుపుకోవాలంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన నలుగురు జమ్మూ కశ్మీర్‌ విద్యార్థినులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైపూర్‌లోని ఓ ప్రైవేట్‌ యూనివర్సిటీలో చదువుతున్న ఈ నలుగురు విద్యార్థినులను వర్సిటీ సైతం సస్పెండ్‌ చేసింది.

వాట్సాప్‌లో దేశ వ్యతిరేక సందేశాన్ని షేర్‌ చేసినందుకు వారిని సస్పెండ్‌ చేసిన యూనివర్సిటీ అధికారులు అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. విద్యార్థినుల చర్యను తీవ్రంగా ఖండించిన నిమ్స్‌ యూనివర్సిటీ ఈ తరహా కార్యకలాపాలను వర్సిటీ సహించదని, వీరిని కాలేజ్‌తో పాటు హాస్టల్‌ నుంచి సస్పెండ్‌ చేశామని వెల్లడించింది. విద్యార్థినులను తల్వీన్‌ మంజూర్‌, ఇక్రా, జోహ్ర నజీర్‌, ఉజ్మా నజీర్‌గా గుర్తించారు.

పుల్వామా దాడిపై వారు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతీకారం తీర్చుకున్నామని వాట్సాప్‌లో పేర్కొన్నారు. పుల్వామా దాడి తమ ప్రతీకారానికి దీటైన సమాధానం అంటూ విద్యార్థినుల్లో ఒకరైన తల్వీన్‌ తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఘటనపై వర్సిటీలో నిరసనలు వెల్లువెత్తాయి. కాగా, జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు