వివాదంగా మారిన ఆదివాసీల ముద్దుల పోటీలు

11 Dec, 2017 15:52 IST|Sakshi

రాంచీ : పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకోవటం అనేది భారతీయ సంస్కృతిలో భాగం కాదనేది కొందరి అభిప్రాయం. అయితే ఆధునికత పేరిట ఈ మధ్య యువత పెద్దగా పట్టించుకోవటం లేదు. కానీ, జార్ఖండ్‌లో ఈ మధ్య ఓ గ్రామంలో నిర్వహించిన ముద్దుల పోటీలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. 

రాంచీకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకుర్‌ జిల్లా డుమారియా గ్రామంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంత ఎమెల్యే సిమన్‌ మరాండి(జేఎంఎం) నేతృత్వంలోనే ఈ పోటీలు జరుగుతుండటం విశేషం. పెళ్లయిన గిరిజన దంపతులు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఎవరు ఎంత ఎక్కువ సేపు ముద్దు పెట్టుకుంటే.. వారి మధ్య అంత ప్రేమ ఉన్నట్లు లెక్క. చివరకు మిగిలిన జంటకు బహుమతులను అందిస్తారు. 

‘‘ఆదివాసీయులు అమాయకులు.. పైగా నిరక్షరాస్యులు. అందుకే వారి కుటుంబాలలో బంధాలు అంత బలంగా ఉండవు. భార్యభర్తల మధ్య ప్రేమను పెంచేందుకే ఈ పోటీ నిర్వహిస్తున్నా. ఆధునికత నేర్పించి వారిని అభివృద్ధి బాటలోకి తీసుకొస్తా’’ అని సిమన్‌ చెబుతున్నారు.  కాగా, ఇలా బహిరంగ ముద్దులు సభ్యత కాదని ఆరోపిస్తూ మహిళా సంఘాలు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశాయి.

ఇక డుమారియాలో ఈ మేళాను రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. గత 37 ఏళ్లుగా సిమన్‌ కుటుంబ సభ్యులే ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. విలు విద్య, గిరిజన నృత్యాలు, పరుగు పందాలు తదితర పోటీలు నిర్వహిస్తుండగా.. ఈ ఏడాదే ప్రయోగాత్మకంగా ముద్దుల పోటీని ఆయన ప్రవేశపెట్టారు. శుక్ర, శని వారాల్లో ఈ పోటీలు నిర్వహించగా.. 18 మంది దంపతులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు