తమిళనాడు పాలనపై గవర్నర్ ఆరా

8 Oct, 2016 02:17 IST|Sakshi
తమిళనాడు పాలనపై గవర్నర్ ఆరా

* ఇద్దరు సీనియర్ మంత్రులు, ప్రధాన కార్యదర్శితో భేటీ
* జయ ఆరోగ్యంపై వైద్యుల్ని అడిగి తెలుసుకున్న రాహుల్

సాక్షి, చెన్నై: తమిళనాడులో రోజువారీ సాధారణ పరిపాలనపై ఇద్దరు రాష్ట్ర  సీనియర్ మంత్రులు, ప్రధాన కార్యదర్శితో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు శుక్రవారం  చర్చించారు. సీఎం జయలలిత ఆరోగ్యంపై ఆరా తీశారు. రెండు వారాలుగా జయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో భేటీ జరిగింది. జయ ఆరోగ్యంపై సమావేశమయ్యారా? లేక  సీఎం  మరికొద్ది రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సిన పరిస్థితుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తారా? అని ఊహాగానాలు  వచ్చాయి. 

వాటికి తెరదించుతూ... రాష్ట్రంలో దైనందిన పాలన, ప్రభుత్వ వ్యవహారాలపై గవర్నర్ ఆరాతీశారంటూ రాజ్‌భవన్ తెలిపింది. పరిపాలనా వ్యవహారాలపై గవర్నర్‌కు ప్రధాన కార్యదర్శి పి.రామమోహనరావు వివరించారని, ఇతర అంశాలూ చర్చకు వచ్చాయని ఓ ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం మధ్యాహ్నం గవర్నర్‌ను ఒంటరిగా కలసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి... సాయంత్రం మంత్రులతో పాటు మరోసారి కలిశారు. జయ ఆరోగ్యం గురించి ఆమె  విధేయుడు, మంత్రి పన్నీర్‌సెల్వం, మరో మంత్రి పళనిస్వామిల్ని గవర్నర్ వాకబు చేశారు. జయ ఆస్పత్రిలో చేరాక సీనియర్ మంత్రులు, ప్రధాన కార్యదర్శితో గవర్నర్ చర్చలు జరపడం ఇదే తొలిసారి.  కావేరిపై ఏర్పాటైన  సాంకేతిక బృందం గురించి  మంత్రుల్ని గవర్నర్ ప్రశ్నించారని రాజ్‌భవన్ పేర్కొంది.
 
అండగా ఉంటాం..రాహుల్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారమిక్కడి  అపోలో ఆస్పత్రికి వెళ్లి జయ ఆరోగ్యంపై వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. జయకు తనతో పాటు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. సీఎం కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారన్నారు.

మరిన్ని వార్తలు