జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

30 Apr, 2018 18:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) సోమవారం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్‌ పేపర్‌-1 ఫలితాలను, ఆల్‌ ఇండియా ర్యాంకులను విడుదల చేసింది. తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. విజయవాడకు చెందిన సూరజ్‌ కృష్ణ ఫస్ట్‌ ర్యాంకు, విశాఖకు చెందిన హేమంత్‌కు రెండో ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఇక హైదరాబాద్‌ కు గట్టు మైత్రేయకు ఐదో వచ్చింది.

జేఈఈ మెయిన్స్‌-2018 ఫలితాల వివరాలను jeemain.nic.inలో చూసుకోవచ్చు. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌ పరీక్షలకు దేశవ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1.50 లక్షల మంది ఈ పరీక్షలు రాశారు.

మెయిన్స్‌ కటాఫ్‌ ద్వారా 2.24 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు అర్హత సాధిస్తారు. వచ్చే నెల 20న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు జరుగుతాయి. సీబీఎస్‌ఈ బోర్డు సైతం జేఈఈ మెయిన్ 2018 ఫలితాలను cbseresults.nic.in, results.nic.in వెబ్‌సైట్ల ద్వారా విడుదల చేయనుంది. మెయిన్స్‌ పేపర్‌-2 ఫలితాలను వచ్చే నెల 31న సీబీఎస్‌ఈ విడుదల చేయనుంది.

తగ్గుతున్న ఆసక్తి
2015–16 విద్యా సంవత్సరంలో 12.93 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌ రాసేందుకు దరఖాస్తు చేసుకోగా, 2018–19లో 11.35 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం ఇందుకు ఉదాహరణ. ఏదో పరీక్ష రాద్దామనే ఉద్దేశంతో కాకుండా సీరియస్‌గా ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులే దరఖాస్తు చేసుకుంటున్నారని, దరఖాస్తులు తగ్గడానికి అదే కారణమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఇక ప్రవేశాల విషయానికి వస్తే.. నాలుగేళ్ల కిందటి పరిస్థితితో పోల్చితే కొంత మెరుగైనా ఇంకా సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి.

ఇంకా మిగులే..
ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. గతంలో కంటే సీట్ల మిగులు అధికంగా ఉంటోంది. జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఖరారులో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ తొలగించడం, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు ఇంటర్‌ మార్కులు 75% (ఎస్సీ, ఎస్టీలకు 65%) ఉంటే చాలన్న సడలింపు ఇచ్చినా సీట్ల మిగులు తగ్గడం లేదు. సీట్ల మిగులు ఉండకుండా చూసేందుకు మూడేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం వెయిటేజీ తొలగింపు, సడలింపులు వంటి చర్యలు చేపట్టడంతోపాటు ఏడు విడతలుగా ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోంది. అయినప్పటికీ మార్పు రావడం లేదు. 2014–15 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో కేవలం 3 సీట్లు మిగిలిపోగా, 2017–18లో 121 సీట్లు మిగిలిపోయాయి.

అడ్వాన్స్‌డ్‌కు అర్హుల సంఖ్య పెంచినా..
జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నా పరిస్థితి అలానే ఉంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిలో టాప్‌ 1.5 లక్షల మంది విద్యార్థులను గతంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా తీసుకునేవారు. క్రమంగా దాన్ని టాప్‌ 2 లక్షలకు, టాప్‌ 2.2 లక్షలకు, ప్రస్తుతం టాప్‌ 2.24 లక్షలకు పెంచింది. అయినా సీట్ల మిగులు పెరుగుతోంది. అయితే కాన్పూర్, హైదరాబాద్‌ ఐఐటీల్లో మాత్రం నాలుగేళ్లుగా ఒక్కసీటు కూడా మిగలకపోవడం విశేషం.

>
మరిన్ని వార్తలు