పోలీసుల సమక్షంలోనే ఆ ‘దాడి’

8 Jan, 2020 14:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్‌లోని హాస్టళ్లపై ఆదివారం దుండగులు జరిపిన దాడి పోలీసుల సమక్షంలోనే జరిగిందని, అయినప్పటికీ దాన్ని ఆపేందుకు ఢిల్లీ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆ దాడిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను చూస్తే స్పష్టం అవుతోంది. దుండగులలో ఒక్కరిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నించక పోవడం ఆశ్చర్యం. ఈ సంఘటనపై ఢిల్లీ పోలీసులు సోమవారం మధ్యాహ్నం ‘గుర్తుతెలియని వ్యక్తుల’ పేరిట హిందీలో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. 

ఎఫ్‌ఐఆర్‌ కథనం ప్రకారం ‘పెరియార్‌ హాస్టల్‌ వద్ద కొంతమంది విద్యార్థులు గుమిగూడారని, వారు ఇతరులు కొడుతున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆదివారం సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో క్యాంపస్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ వద్ద పోలీసు సబ్‌ ఇనిస్పెక్టర్‌కు సమాచారం అందింది. ఎఫ్‌ఐఆర్‌ కోసం ఫిర్యాదు చేసిన వసంత్‌కుంజ్‌ నార్త్‌ పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి, పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్, మరి కొంతమంది పోలీసులు పెరియార్‌ హాస్టల్‌ వద్దకు వెళ్లగా అక్కడ 50–60 మంది ముసుగులు ధరించి కర్రలతో విద్యార్థులను కొడుతూ కనిపించారు. పోలీసులను చూడగానే వారు అక్కడి నుంచి పారిపోయారు. 

సాయంత్రం ఏడు గంటలకు సబర్మతి హాస్టల్లోకి కొంత మంది దుండగులు ప్రవేశించి కొడుతున్నారని పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందింది. ఆయన వెంటనే ఫిర్యాదు చేసిన పోలీసు అధికారిని, తన సిబ్బందిని తీసుకొని సబర్మతి హాస్టల్‌కు వెళ్లారు. అక్కడ 50–60 మంది ముసుగులు ధరించి వ్యక్తులు కర్రలతో విద్యార్థులను బాదడం కనిపించింది. వారిని మైకులో హెచ్చరించడంతో ఎక్కడి వారక్కడ వెళ్లిపోయారు. అదే సమయంలో క్యాంపస్‌లో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిందిగా క్యాంపస్‌ అధికారుల నుంచి విజ్ఞప్తి అందడంతో అదనపు బలగాలను పోలీసులు పిలిపించారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తీసుకెళ్లారు’

ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు గత కొంతకాలంగా క్యాంపస్‌ ఆవరణలో పోలీసు పికెట్‌ ఉంటోంది. ఆ రోజు 3.45 గంటల ప్రాంతంలోనే 50–60 మంది ముసుగు దుండగులను వారు చూసినప్పుడు వారు ఎందుకు స్పందించలేదు? సాయంత్రం కూడా వారు మళ్లీ కనిపించినప్పుడు వారిలో ఒక్కరిని కూడా పట్టుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదు? మొదట్లోనే అదనపు బలగాల కోసం వారు ఎందుకు కోరలేదు? దుండగులు 3.45 గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు స్వైర విహారం చేసిన క్యాంపస్‌ అధికారులు ఎందుకు సకాలంలో స్పందించలేదు? అసులు దాడి జరిగినప్పుడు క్యాంపస్‌లో ఎంత మంది పోలీసులు ఉన్నారు? అదనపు బలగాల్లో ఎంత మంది, ఎప్పుడు వచ్చారు? ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు కొత్తగా దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులైన కనుక్కుంటారేమో చూడాలి!

చదవండి:

ఆమె తలపై ఉన్నది రక్తమేనా; కంపరంగా ఉంది

జేఎన్యూలో దీపిక

జేఎన్యూ : పోస్టర్లున్న గదులవైపు వెళ్లలేదు..!

జేఎన్యూ దాడి మా పనే

అప్పట్లో తుక్డే-తుక్డే గ్యాంగ్ లేదు: కేంద్ర మంత్రి

జేఎన్యూ దాడి: ఫాసిస్ట్ సర్జికల్ స్రైక్స్..!

మరిన్ని వార్తలు