కన్యత్వ పరీక్షలు.. వాట్సాప్‌ గ్రూప్‌పై మండిపాటు

10 Mar, 2018 16:57 IST|Sakshi

ఆ వాట్సాప్‌ గ్రూప్‌ మమ్మల్ని బజారుకీడుస్తోంది..

కంజర్‌భట్‌ తెగ మహిళల ఆందోళన..

పుణె: దేశంలో దురాచారాలకు కొదవే లేదు. పెళ్లైన నవ వధువుకి కన్యత్వ  పరీక్షలు చేస్తున్న అనాగరిక ఆచారం ఓవైపు .. తమ తెగలోని మహిళలకు ఎదురయ్యే పరిస్థితులను సోషల్‌ మీడియా వేదికగా బయటపెడుతున్న ప్రబుద్ధులు మరోవైపు. వెరసి కంజర్‌భట్‌ దురాచార బాధితుల సమాచారం వాట్సాప్‌లో వైరల్‌ అవటం చర్చనీయాంశంగా మారింది. 

విషయం ఏంటంటే..  కంజర్‌భట్‌ తెగలో తొలి రాత్రి మహిళలకు కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఆచారానికి వ్యతిరేకంగా ‘స్టాప్‌ ద వీ-రిచువల్‌’ పేరిట ఓ వాట్సాప్‌ గ్రూప్‌ బాధితుల ఫోటోలను, సమాచారాన్ని వైరల్‌ చేస్తోంది. అయితే ఆ వాట్సాప్‌ గ్రూప్‌ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని.. తమ జాతిని అవహేళన చేస్తోందని సదరు తెగ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. ‘సత్వ పరీక్ష’ల ఆచారం వల్ల ఏ మహిళ కూడా బాధితురాలిగా మిగల్లేదని.. తమ జాతిపై తప్పుడు ప్రచారం చేసిన వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌ క్షమాపణలు చెప్పాలని కమ్యూనిటీ సభ్యురాలు భావనా మనేకర్‌ డిమాండ్‌ చేశారు.  

అత్తింటివారి,పుట్టింటి వారి మద్దతుతోనే ఈ పరీక్షలు జరగుతాయనీ.. వీటిలో ఎవరి జోక్యం అవసరం లేదనీ అదే తెగలోని మరో వర్గం మండిపడుతోంది.​  వాస్తవాలను మరుగున పరిచి ఆర్థికంగా లాభం పొందడానికి కొందరు కావాలనే దుష్ర్పచారాలు చేస్తున్నారని వారంటున్నారు. కాగా ఈ వాట్సాప్‌ గ్రూప్‌పై చర్యలు తీసుకోవాలని తెగ నాయకులు కొందరు కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే కు ఫిర్యాదు చేశారు కూడా.

>
మరిన్ని వార్తలు