తీవ్రవాద సంస్థలోకి కశ్మీరీ యువత

17 Mar, 2018 18:00 IST|Sakshi
బిలాల్‌ అహ్మద్‌ షా (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)

శ్రీనగర్‌ : కశ్మీరీ యువతను ఆకర్షించడమే లక్ష్యంగా తీవ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. గతంలో మన్వన్‌ వనీ అనే పీహెచ్‌డీ విద్యార్థి ఈ సంస్థలో చేరాడు. తాజాగా కుప్వారాకు చెందిన బిలాల్‌ అహ్మద్‌ షా అనే 27 ఏళ్ల యువకుడు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌లో చేరినట్లు ప్రకటించాడు. చేతిలో తుపాకీ పట్టుకుని తీవ్రవాద సంస్థ యూనిఫామ్‌ ధరించిన బిలాల్‌ ఫోటో షాబాజ్‌ అనే మారు పేరుతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తిరిగి రావాలంటూ అభ్యర్థన..
మార్చి 2న లడఖ్‌ వెళ్తున్నట్లుగా సోదరునితో చెప్పిన బిలాల్‌ ఇంటి నుంచి బయలుదేరాడు. ఆనాటి నుంచి అతని గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ తుపాకీ పట్టుకున్న నా సోదరుని ఫోటో చూస్తే ఆందోళన కలుగుతోంది. మా మాట విని ఇంటికి తిరిగి రా. చిన్ననాడే నాన్నను మనకు దూరం చేసిన అదే మార్గంలోకి వెళ్లి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దంటూ’ బిలాల్‌ సోదరి షకీనా అక్తర్‌ పలు న్యూస్‌ ఏజెన్సీల ద్వారా అభ్యర్థిస్తోంది. కాగా బిలాల్‌ తండ్రి షంషుద్దీన్‌కు కూడా తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉండేవి. 1992లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో అతను మృతి చెందాడు.

మూడేళ్లలో 280 మంది..
గతంలోనూ ఉత్తర కశ్మీర్‌ నుంచి ఎంతో మంది యువకులు హిజ్బుల్‌లో చేరారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత మూడేళ్ల కాలంలో 280 మంది యువకులు మిలిటెంట్‌ గ్రూపులో చేరారు. అందులో 126 మంది గతేడాది వివిధ ర్యాంకులు కూడా పొందారు. 2016లో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు చెందిన బుర్హన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ అనంతరం ఆ సంస్థలో చేరుతున్న కశ్మీరీ యువత సంఖ్య క్రమంగా పెరుగుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

మరిన్ని వార్తలు