'నాపై కిరణ్ బేడీ పోటీ చేయాల్సింది'

24 Jan, 2015 11:15 IST|Sakshi
'నాపై కిరణ్ బేడీ పోటీ చేయాల్సింది'

న్యూఢిల్లీ: బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. తాను పోటీకి దిగిన ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిరణ్ బేడీ  పోటీ చేస్తే  బాగుండేదని కేజ్రీవాల్  తాజాగా పేర్కొన్నారు. తామిద్దరం అవినీతిపై ఉద్యమిస్తున్నా.. ప్రస్తుత పోటీ మాత్ర వేర్వేరు నియోజకవర్గాల నుంచి జరగడం పెద్దగా ఆసక్తినివ్వడం లేదన్నారు. త్వరలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్-బేడీల మధ్య ప్రధాన పోటీ జరుగుతున్నా.. అది సీఎం అభ్యర్థుల వరకే పరిమితమయ్యింది. ఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ బరిలోకి దిగుతుండగా,  బేడీ మాత్రం బీజేపీకి మంచి పట్టున్నకృష్ణా నగర్ నుంచి పోటీ చేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే నామినేషన్లు ప్రక్రియ పూర్తయిన తరుణంలో కేజ్రీవాల్ మరోసారి బేడీని టార్గెట్ చేశారు. 'ఈసారి నాకు ప్రధానమైన అభ్యర్థి కిరణ్ బేడీ. గతంలో నేను మూడు సార్లు సీఎం పదవిని చేపట్టిన షీలా దీక్షిత్ పై పోటీ చేసి గెలిచా. కిరణ్ బేడీ అక్కడి (కృష్ణా నగర్) నుంచి కాకుండా ఢిల్లీలో పోటీకి దిగాల్సింది' అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ట్విట్టర్ నుంచి తన అకౌంట్ ను బేడీ తొలగించడంపై కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తన అకౌంట్ ను ఆమె ఎందుకు బ్లాక్ చేశారో తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను ఎప్పుడూ ట్విట్టర్ లో మర్యాదపూర్వకమైన భాషనే వాడుతున్నా.. తన అకౌంట్ తొలగించడం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదన్నారు.

మరిన్ని వార్తలు