22న నింగిలోకి.. చంద్రయాన్‌-2

19 Jul, 2019 11:51 IST|Sakshi

నాలుగు రోజుల్లోనే చంద్రయాన్‌–2కు మరమ్మతులు

రెట్టించిన ఉత్సాహంలో శాస్త్రవేత్తలు

చకచకా ప్రయోగం పనులు

ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రయోగం. ప్రపంచ దేశాలన్నీ సతీష్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ వైపే చూశాయి. ఈ ప్రయోగాన్ని వీక్షించేం దుకు దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా వచ్చారు. ఆదివారం ఉదయం కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. దేశమంతా మేల్కొని ప్రయోగాన్ని చూస్తోంది. ఇంకొన్ని నిమిషాల్లో చంద్రయాన్‌–2 నింగికి పయనమయ్యేది.. కానీ క్రయోజనిక్‌ దశలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం వాయిదా పడింది. అందరితో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు సైతం నిరాశ చెందారు. ఇక ప్రయోగానికి రెండు నెలల సమయం పడుతుందనుకున్నారు. శాస్త్రవేత్తలు వెంటనే తేరుకున్నారు. కేవలం రోజుల వ్యవధిలోనే సమస్యను సరిచేశారు. రెట్టించిన ఉత్సాహంతో ఈ నెల 22వ తేదీన సగర్వంగా చంద్రయాన్‌–2ను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.

సాక్షి, సూళ్లూరుపేట: పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ప్రయోగాల్లో ఇస్రోది తిరుగులేని ఆధిపత్యం. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో జీఎస్‌ఎల్‌వీ రాకెట్లను సైతం విజయవంతంగా నింగికి పంపుతోంది. ఇందులో క్రయోజనిక్‌ దశ కీలకమైంది. తొలినాళ్లలో రష్యా నుంచి తెచ్చిన క్రయోజనిక్‌ ఇంజిన్ల సహకారంతో జీఎస్‌ఎల్‌వీని ప్రయోగించేది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇంజిన్లు తయారు చేసే విషయంలో ఇస్రో ముందడుగు వేసింది. ఇప్పటివరకూ 13 జీఎస్‌ఎల్‌వీలు ప్రయోగించగా అందులో 7 స్వదేశీ ఇంజిన్లు ఉండడం గమనార్హం. ఇందులో ఒకటి మాత్రమే విఫలమైంది. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్‌ల సిరీస్‌లో మూడు ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. 2010 ఏప్రిల్‌ 5వ తేదీన తొలిసారిగా స్వదేశీ క్రయోజనిక్‌ ఇంజిన్‌తో చేసిన ప్రయోగం విఫలమైంది.

అందులో జరిగిన లోపాలపై 2010 నుంచి 2013 దాకా అధ్యయనం చేసింది. లోపాలను సరిదిద్ది అదే సంవత్సరం ఆగస్టు 19న జీఎస్‌ఎల్‌వీ డీ5 ప్రయోగానికి సిద్ధమైంది. ఆ ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్‌ ప్రారంభించి మరో గంటలో ప్రయోగం ఉందనగా రెండోదశలో లీకేజీని గుర్తించి ప్రయోగాన్ని ఆపేసింది. అది మేజర్‌ సాంకేతిక లోపం కావడంతో రాకెట్‌లోని ఇంధనాన్ని అంతా వెనక్కి తీయడమే కాకుండా రాకెట్‌ను పూర్తిగా విప్పేసి రెండో దశలో లీకేజీ వచ్చిన చోటును గుర్తించి నాలుగు నెలల్లో అంటే 2014 జనవరి నెలలో ప్రయోగాన్ని చేసి విజయవంతంగా గగనంలోకి పంపింది. ఆ తరువాత చేసిన జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలన్నీ విజయవంతం కావడం విశేషం. 

ప్రయోగానికి సిద్ధం 
తాజాగా చంద్రయాన్‌–2 మిషన్‌ను తీసుకెళ్లే జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌లో మూడో దశలోని క్రయోజనిక్‌ దశలో పోగో గ్యాస్‌బాటిల్స్‌ నుంచి ట్యాంక్‌కు వెళ్లే పైపులు బయటవైపు లీకేజీని గుర్తించి 56.24 నిమిషాల ముందు ప్రయోగాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ సాంకేతిక లోపాన్ని అధిగమించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు చర్యలు చేపట్టారు. కేవలం నాలుగు రోజుల్లోపే అంతా సరిచేసి ప్రయోగానికి సిద్ధమయ్యారు. అయితే ముందుగా సెప్టెంబర్‌ నెల వరకు పడుతుందని, ఈ ఏడాది ఆఖరు దాకా సమయం తీసుకుంటుందని అనుకున్నారు. శాస్త్రవేత్తలు దీనిని సవాలుగా తీసుకుని తక్కువ సమయంలో మరమ్మతులు చేశారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని ఈ నెల 22న సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. 

>
మరిన్ని వార్తలు