పప్పుల ధరలు దిగేదెన్నడు?

29 Jul, 2016 01:06 IST|Sakshi
పప్పుల ధరలు దిగేదెన్నడు?

తేదీని ప్రకటించాలంటూ లోక్‌సభలో రాహుల్ డిమాండ్
* ధరల అంశంలో ప్రధాని మోదీ మౌనంపై విమర్శలు
* అప్పుడు హర హర మోదీ... ఇప్పుడు కందిపప్పు మోదీ
* తేదీల కంటే విధానాలతోనే సమస్యల పరిష్కారం: జైట్లీ

న్యూఢిల్లీ: అధికారంలోకి వచ్చాక ధరల పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోదీ ఏమీ మాట్లాడలేదని, పప్పుదినుసుల ధరలు ఎప్పుడు తగ్గుతాయో తేదీ ప్రకటించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ లోక్‌సభలో డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలపై చర్చలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల వేళ హర హర మోదీ అని కీర్తిస్తే... ఇప్పుడు కందిపప్పు మోదీ అంటున్నారు’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

వర్షాకాల సమావేశాల్లో మొదటిసారి పూర్తి స్థాయి చర్చలో పాల్గొన్న రాహుల్ ప్రసంగిస్తూ.. ‘ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పప్పులు, కూరగాయల ధరలు చుక్కల్ని తాకాయని, ఆ పెరుగుదలతో రైతులు ఎలాంటి లబ్ధి పొందలేదు’ అని విమర్శించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 2014న హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సభలో ‘తల్లి, బిడ్డ రాత్రంతా ఏడుస్తూ, తమ కన్నీళ్లను తాగుతూ నిద్రపోయారు’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గుర్తు చేశారు. తోచిన అర్థంలేని వాగ్దానాలు చేసినప్పటికీ, కందిపప్పు ధర ఎప్పుడు దిగివస్తుందో కచ్చితంగా చెప్పాలన్నారు.

ఎన్నికల సమయంలో తనకు కాపలాదారు బాధ్యత ఇవ్వాలని చెప్పిన మోదీకి తెలిసే పప్పుదినుసుల దోపిడీ సాగుతోందని రాహుల్ ఆరోపించారు. ‘పారిశ్రామికవేత్తలకు రూ. 52 వేల కోట్ల రుణాల్ని ఈ ప్రభుత్వం మాఫీ చేసింది. ముడిచమురు ధరల తగ్గుదలతో లాభపడ్డ రూ. 2 లక్షల కోట్లతో రైతులు, గృహిణులకు ఏం చేశారు’ అంటూ రాహుల్ నిలదీశారు.  
 
ద్రవ్యోల్బణాన్ని అదుపుచేశాం: జైట్లీ
రాహుల్ ఆరోపణల్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. ద్రవ్యోల్బణాన్ని ఎన్డీఏ ప్రభుత్వమే అదుపులోకి తెచ్చిందని, మంచి వానలు పడడంతో నిత్యావసర వస్తువుల ధరలు మున్ముందు తగ్గవచ్చని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీఏ హయాం నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి అధిక ద్రవోల్బణం వారసత్వంగా సంక్రమించిందని, యూపీఏ హాయంలో ద్రవ్యోల్బణం, ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని పోల్చి చూడాలన్నారు. ‘తేదీలు ప్రకటించడం కంటే విధానాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయి. మరింత పప్పుధాన్యాల ఉత్పత్తి కోసం రైతుల్ని ప్రోత్సహించే విధానాలపై ప్రభుత్వం కృషిచేస్తోంది’ అని అన్నారు. నెలవారీ లెక్కల ప్రకారం పప్పుదినుసుల ద్రవ్యోల్బణం దిగివస్తోందని, ధరల పెరుగుదలలో అవినీతి కోణం చూడకూడదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న కుంభకోణాలు యూపీఏ ప్రభుత్వంలో జరిగినవేనన్నారు.
 
ఆధార్ తప్పనిసరిపై రాజ్యసభలో ఆందోళన
ఎల్పీజీ, ప్రజా పంపిణీ వ్యవస్థ, పింఛన్లు వంటి పథకాల లబ్ధికి ఆధార్‌ను తప్పనిసరి చేయడంపై రాజ్యసభ కార్యకలాపాల్ని ప్రతిపక్షాలు గురువారం అడ్డుకున్నాయి. సభా కార్యకలాపాలను రద్దు చేసి ఆధార్ అంశంపై చర్చించాలంటూ తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ, సమాజ్‌వాదీ పార్టీలు సభ ప్రారంభానికి ముందు చైర్మన్‌కు నోటీసులిచ్చాయి. కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు తెలిపాయి. కాగా, అటవీకరణ నిధి బిల్లు, 2016ను రాజ్యసభ ఆమోదించింది. గతేడాది మేలో ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో గత నాలుగేళ్లుగా ఖర్చుపెట్టకుండా ఉన్న రూ. 42 వేల కోట్లకు మోక్షం లభించింది. లోక్‌పాల్ చట్ట సవరణ బిల్లునూ రాజ్యసభ ఆమోదించింది.

మరిన్ని వార్తలు