తొలగని సస్పెన్స్‌

20 Sep, 2017 14:22 IST|Sakshi
తొలగని సస్పెన్స్‌

సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సందిగ్ధం కొనసాగుతోంది. బలపరీక్ష, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మద్రాసు హైకోర్టు ఎటూ తేల్చకపోవడంతో ఉత్కంఠకు తెర పడలేదు. అన్నాడీఎంకేలోని రెండు వర్గాలకు ఊరటనిచ్చేలా ఉన్నత న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులిచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు బలపరీక్ష నిర్వహించొద్దని ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను కొనసాగించాలని సూచించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు 18 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించొద్దని పేర్కొంది.

దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత విచారణను అక్టోబర్‌ 4కు కోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు ఆ స్థానాలు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించొద్దని ఆదేశించింది. హైకోర్టు తీర్పును దినకరన్‌ వర్గం స్వాగతించింది. తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. స్పీకర్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

అయితే స్పీకర్‌ చట్టప్రకారమే వ్యవహరించారని, ఎటువంటి తప్పుచేయలేదని ఆయన తరపున వాదించిన న్యాయవాది ఆర్యమన్‌ సుందరం.. కోర్టుకు తెలిపారు. డిఎంకే తరపున కపిల్‌ సిబల్‌ వాదనలు విన్పిస్తూ.. బలపరీక్ష నిర్వహించకుండా కావాలనే గవర్నర్‌ కాలయాపన చేశారని పేర్కొన్నారు.