‘నా చావుకు కారణం నరేంద్ర మోదీయే’...

11 Apr, 2018 13:25 IST|Sakshi

యావత్‌మాల్‌, మహారాష్ట్ర : ప్రభుత్వాలు ఎన్ని మారిన రైతు బతుకుచిత్రం మాత్రం మారదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న తన కుటుంబాన్ని పోషించలేని నిస్సహాయ స్థితిలో బలవంతంగా తనువు చాలిస్తున్నాడు. మన బ్యాంకులు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం దాటే బడా బాబులకు అప్పులిస్తాయి కానీ పదిమందికి అన్నం పెట్టే రైతుకు రుణం ఇవ్వాలంటే మాత్రం ముందుకు రావు. చేసేదేమి లేక వ్యాపారుల దగ్గర రుణాలు తీసుకుని వాటిని తీర్చలేక ఈ నేలతో వారి రుణానుబంధాన్ని తెంచుకుని వెళ్తున్నారు. ప్రకృతి సహకరించక, ప్రభుత్వం ఆదుకోక మరో దారి లేక తనువు చాలిస్తున్న రైతన్నల మరణాలకు కారకులేవరు..? సమాధానం దొరకని ఈ ప్రశ్నకు మహారాష్ట్రకు చెందిన ఓ రైతు మాత్రం తన చావుకు ముమ్మాటికి ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే కారణం అంటున్నాడు .

యవంతాల్‌ జిల్లా రాజుర్వాడి గ్రామానికి చెందిన శంకర్‌ భౌరవ్‌ చైరే(50) అనే రైతు వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రభుత్వ సొసైటీ వద్ద రూ.90వేలు, బయట వడ్డీ వ్యాపారీ వద్ద రూ.3లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ మొత్తంతో తన భూమిలో పత్తి పంటను సాగు చేశాడు. కానీ బోలుపురుగు వ్యాపించి పంట పూర్తిగా దెబ్బతిన్నది. బోలు పురుగు వ్యాప్తి వల్ల ఈ సంవత్సరం విదర్భ ప్రాంతంలో పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పుల భారం పెరగడంతో​ రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహా ధర్నా నిర్వహించారు. దిగి వచ్చిన ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించింది. కానీ ఈ రుణమాఫీ ప్రభుత్వ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. శంకర్‌ భౌరవ్‌ సొసైటీ నుంచి తీసుక్ను​ తొంభై వేల రుణం మాఫీ అయ్యింది, కానీ ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకున్న మూడు లక్షల రుణం అలానే ఉంది.

అంత పెద్ద మొత్తాన్ని తీర్చడం తన వల్ల కాదని భావించాడు. తనకు అవసరమయిన మొత్తాన్ని బ్యాంకులు ఇచ్చి ఉంటే తనకు పూర్తి రుణమాఫీ వర్తించేది, అలా జరగలేదు కనుక దీనంతటికి కారణం ప్రస్తుత ప్రభుత్వము, ప్రధాని మోదీనే కారణం అని భావించి  ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి ప్రధాని మోదీ, ఎన్డీయే ప్రభుత్వమే కారణం అని రెండు పేజీల ఉత్తరాన్ని రాశాడు. అనంతరం పురుగుల మందు తాగి పొలంలోనే స్పృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన ఇతర రైతులు శంకర్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ ఈ లోపే శంకర్‌ చనిపోయాడు. శంకర్‌ మృతితో ఆగ్రహించిన అతని కుటుంబ సభ్యులు ప్రభుత్వం వచ్చి తమకు న్యాయం చేసేంతవరకూ  మృతదేహాన్ని కదలనిచ్చేదిలేదని ఆందోళన చేశారు.

దాంతో ‘వసంత్‌రావ్‌ నాయక్‌ శెటి స్వావలంభన మిషన్‌’(ఎస్‌ఎన్‌ఎస్‌ఎస్‌ఎం) ప్రెసిడెంట్‌ కిషోర్‌ తివారీ సంఘటన స్థలాన్ని సందర్శించి తక్షణ సాయంగా లక్ష రూపాయలను మంజూరు చేశారు. వారి కుటుంబంలో చదుదవుకుంటున్న వారు ఉన్నట్లయితే ఇక మీదట వారి చదువు బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని ప్రకటించారు. ఒక వేళ వారి చదువులు పూర్తి అయితే​ వారికి తగిని జీవనోపాధి చూపిస్తామని హామీ ఇచ్చారు. మరణించి శంకర్‌కు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. ఒక్క కుమార్తేకు మాత్రమే వివాహం అయ్యింది.

మరిన్ని వార్తలు