చచ్చిపోతా; ఒక్కసారిగా పెరిగిన ఫాలోవర్లు!

23 Sep, 2019 15:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : టిక్‌టాక్‌ యాప్‌కు తక్కువ టైమ్‌లోనే ఎక్కువమంది బానిసలయ్యారు. ఇది రానురానూ పబ్జీ కన్నా డేంజర్‌గా మారుతోంది. ఇప్పటికే టిక్‌టాక్‌ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కాగా తాజాగా ఓ వ్యక్తి చచ్చిపోతానంటూ వీడియో తీసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేసి అందరినీ ఆందోళనకు గురిచేశాడు. వివరాలు.. టిక్‌టాక్‌తో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో సందీప్‌ అలియాస్‌ అర్మన్‌ మాలిక్‌ అనే వ్యక్తి ఒకడు. అతడికి 50 లక్షలకు పైగా టిక్‌టాక్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో అతడు బసచేసిన హోటల్‌ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ సోమవారం మూడు వీడియోలు టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. అందులో తన భార్య పాయల్‌, ఆమె కుటుంబం తనను కావాలని అత్యాచార కేసులో ఇరికించారని ఆవేదన చెందాడు. మరో వీడియోలో అతడి ఇంటి పనిమనిషితో పాటు నీరజ్‌ అనే వ్యక్తి పేర్లను ప్రస్తావించాడు. ఇక మూడో వీడియోలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ఓ లేఖను పోస్ట్‌ చేశాడు.

ఈ మేరకు తన భార్య, ఆమె కుటుంబ సభ్యుల వల్లే చావాలనుకుంటున్నట్టుగా సందీప్‌ లేఖలో పేర్కొన్నాడు. ఇక వీడియో అప్‌లోడ్‌ చేసిన కొద్దిగంటల్లోనే అతని అకౌంట్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కాగా పోలీసులు, ఫైర్‌ టీమ్‌ తీవ్రంగా శ్రమించిన అనంతరం అతన్ని సురక్షితంగా కిందకు దించారు. అహ్మదాబాద్‌కు చెందిన సందీప్‌ తన రెండో భార్యతో కలిసి ఢిల్లీలోని హరినగర్‌ ప్రాంతంలో హోటల్‌లో దిగాడని పోలీసులు తెలిపారు. వారి మధ్య ఏదైనా గొడవ జరిగి ఉండవచ్చని, ఆ కారణంగానే అతను హోటల్‌ చివరి అంతస్తు పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ప్రాణాలు తీసుకుంటానని బెదిరించాడని వారు అనుమానిస్తున్నారు. కాగా సందీప్‌ తన మొదటి భార్య పాయల్‌తో వివాహం జరిగిన హోటల్‌లోనే అతడు చావటానికి సిద్ధపడటం గమనార్హం.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా