‘మీటూ’ కేసులపై కమిటీ!

13 Oct, 2018 04:13 IST|Sakshi
మేనకా గాంధీ

యోచిస్తున్నామన్న మంత్రి మేనకా గాంధీ

మరింత మంది బాధిత మహిళలు గళం విప్పాలని పిలుపు

న్యూఢిల్లీ: ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా వెలుగుచూస్తున్న లైంగిక దాడుల ఆరోపణలపై విచారణకు న్యాయ నిపుణులతో కమిటీ నియమించాలని యోచిస్తున్నట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. బాధితురాళ్ల వేదన,  క్షోభను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. మరింత మంది మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాల్ని వివరించాలని సూచించారు. శుక్రవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు చెప్పారు. లైంగిక వేధింపుల కేసులు చాన్నాళ్లుగా ఉన్నా, మనం పట్టించుకోవడంలేదని, ఇప్పుడు బాధితురాళ్లు వాటిని ఎలా నిరూపిస్తారన్నదే ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మేనక స్పందించలేదు. మంత్రి అక్బర్‌తో పాటు ప్రముఖ సినీ దర్శకుడు సాజిద్‌ ఖాన్, నటుడు అలోక్‌నాథ్‌ తదితరులపై లైంగిక అనుచిత ప్రవర్తన ఆరోపణలు వెల్లువెత్తాయి.

నిరూపణ ప్రశ్నార్థకం..
‘బాధితురాళ్లు చెప్పినదాన్ని నమ్ముతున్నా. వారి బాధ, క్షోభను అర్థంచేసుకోగలను. మీటూ ఉద్యమంలో భాగంగా వెలుగుచూస్తున్న ఇలాంటి కేసుల విచారణకు న్యాయ నిపుణులతో కూడిన కమిటీని నియమించాలని యోచిస్తున్నాం. లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి అందుబాటులో ఉన్న న్యాయ, చట్టబద్ధమైన ఏర్పాట్లను పరిశీలించి, వాటిని బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖకు ఈ కమిటీ సలహాలు, సూచనలు చేస్తుంది. తమకు ఎదురైన ఇలాంటి చెడు అనుభవాల్ని బయటికి చెప్పడానికి మహిళలకు చాలా ధైర్యం కావాలి.

లైంగిక వేధింపుల గురించి పాతికేళ్లుగా వింటున్నాం. కానీ వాటి గురించి చర్చించడానికి, మాట్లాడటానికి వెనకాడుతున్నాం. ఇన్నేళ్ల తరువాత బాధితులు వాటిని ఎలా నిరూపిస్తారన్నదే పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. కారకుల పేర్లను నిర్భయంగా బయటపెట్టడం వల్ల బాధితురాళ్లకు కాస్త సాంత్వన కలుగుతుంది’ అని మేనకా గాంధీ అన్నారు. మహిళలు నేరుగా తనకు ఫిర్యాదుచేసే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, అజ్ఞాత వ్యక్తుల ఫిర్యాదుల్ని కూడా పరిష్కరిస్తామని చెప్పారు. షీబాక్స్, మహిళా, శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్లలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయొచ్చని తెలిపారు.

నిజాన్ని బిగ్గరగా చెప్పాల్సిందే: రాహుల్‌
‘మీటూ’ ఉద్యమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మద్దతుపలికారు. మార్పు తీసుకురావాలంటే నిజాన్ని బిగ్గరగా, స్పష్టంగా చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు. కేంద్ర మంత్రి అక్బర్‌పై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ‘మహిళలను గౌరవంగా, హుందాగా ఎలా చూడాలో అందరూ నేర్చుకోవాల్సిన సమయం ఇది. మార్పు తీసుకురావాలంటే నిజాన్ని బిగ్గరగా, స్పష్టంగా చెప్పాలి’ అని ‘మీటూ’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు