ఎరువుకు నగదు బదిలీ

1 Mar, 2016 03:00 IST|Sakshi
ఎరువుకు నగదు బదిలీ

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా ఎరువుల సబ్సిడీని కూడా నేరుగా రైతులకే అందిస్తామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. దేశంలోని కొన్ని జిల్లాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపడతామని తెలిపారు. ఎరువుల సబ్సిడీకి కేంద్రం ఏటా రూ.73 వేల కోట్ల దాకా వెచ్చిస్తోంది. అయితే ఈ సబ్సిడీని రైతులకు కాకుండా ఎరువుల కంపెనీలకు అందిస్తోంది. ఆ కంపెనీలు సబ్సిడీని మినహాయించి రైతులకు ఎరువులు అందిస్తున్నాయి. ఇందులో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, సబ్సిడీ పక్కదారి పడుతోందన్న ఆరోపణలున్నాయి. దీంతో కేంద్రం సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ‘ఇప్పటికే గ్యాస్ సబ్సిడీకి ప్రత్యక్ష నగదు బదిలీ పథకం (డీబీటీ) అనుసరిస్తున్నాం. ఇది విజయవంతమైన నేపథ్యంలో ఎరువులకు కూడా వర్తింపజేయాలని యోచిస్తున్నాం’ అని జైట్లీ తెలిపారు. ఎరువులకు డీబీటీ వర్తింజేసేందుకు వీలుగా కేంద్రంలోని ఎరువుల విభాగం రైతులను గుర్తించే కార్యాచరణ రూపొందిస్తోంది. నగదు బదిలీని ఎరువుల పరిశ్రమలు స్వాగతించాయి.

>
మరిన్ని వార్తలు