పల్లకిలో కాదు... బుల్లెట్ పై వచ్చింది!

26 Jan, 2016 23:08 IST|Sakshi
పల్లకిలో కాదు... బుల్లెట్ పై వచ్చింది!

పెళ్లితంతులో అనేక సంప్రదాయాలు కొనసాగడం మనం చూస్తుంటాం. అందులో ముఖ్యంగా వధువును పెళ్ళిమండపంలోకి తీసుకు రావడంలోనూ విభిన్న రీతులు కనిపిస్తాయి. ముత్తైదువులంతా చేతులు పట్టుకొని  మండపంలోకి తీసుకొచ్చే సంప్రదాయం కొందరు పాటిస్తే... మరోచోట వధువును బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు మోసుకొని తీసుకొస్తారు. అలాగే పల్లకీలోనూ తెస్తారు. ఇవన్నీ మనం ఇంతకు ముందు చూసినవే. అయితే అహ్మదాబాద్ కు చెందిన ఓ వధువు పెళ్లి మండపంలోకి వచ్చిన తీరు అక్కడి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇంతకూ ఆమె మండపంలోకి ఎలా వచ్చిందో ఊహించగలరా?

అహ్మదాబాద్ కు చెందిన అయేషా ఉపాధ్యాయ తాను పెళ్లిలో విభిన్నంగా కనిపించాలనుకుంది. అదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. పెళ్లి మండపంలోకి  తాను కొత్త స్టైల్ లో ఎంటర్ అవుతానంటూ వారివద్ద ముందే పర్మిషన్ తీసుకుంది.  26 ఏళ్ళ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ అయిన అయేషా... 13 ఏళ్ళ వయసు నుంచే మోటర్ బైక్ లపై ఎంతో ఇష్టాన్ని పెంచుకుంది. అంతేకాదు ఉమెన్ బైకర్స్ గ్రూప్ లో సభ్యురాలుగా కూడ చేరింది. సాధారణంగా వధువులు పల్లకిలోనో, డోలీలోనో మండపంలోకి వచ్చే ట్రెండ్ ను తన కోసం  మార్చుకుంది. తాను స్వయంగా వచ్చేందుకు రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ ను ఎంచుకుంది. తనకు కాబోయే భర్త లౌకిక్ కు బైక్ నడపడం రాదని తెలిసిన ఆమె... బైక్ పై విభిన్నంగా పెళ్లికి ఎంటరవ్వడమే కాక.. త్వరలో భర్తను బుల్లెట్ పై రైడ్ కు తీసుకెడతానంటూ సరదాగా  ప్రామిస్ కూడ చేసింది.