మన మంత్రుల వల్లే.. పాక్ ఉగ్రదాడులు: మాజీ సీఎం

2 Dec, 2016 09:04 IST|Sakshi
మన మంత్రుల వల్లే.. పాక్ ఉగ్రదాడులు: మాజీ సీఎం
జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు ఆయన తండ్రి ఫరూక్ అబ్దుల్లా పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏమనా భారత్ 'బాబుగాడి జాగీరా' అంటూ వ్యాఖ్యానించి తీవ్ర వివాదం రేకెత్తించగా.. ఇప్పుడు ఒమర్ కూడా తండ్రి బాటలోనే మాట్లాడారు. కేంద్ర మంత్రులు పాకిస్థాన్‌ను రెచ్చగొట్టడం వల్లే వాళ్లు నగ్రోటా పట్టణంలో ఉగ్రదాడులు చేసి, ఏడుగురు సైనికులను చంపేశారని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని పలువురు మంత్రులు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల వల్లే నగ్రోటా ఉగ్రదాడి జరిగిందని ఆయన మీడియాతో అన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో పార్టీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. (కశ్మీర్‌పై విషం చిమ్మిన మాజీ ముఖ్యమంత్రి)
 
పెద్దనోట్లను రద్దు చేయడం వల్ల ఉగ్రవాదం అంతమవుతుందని ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యల వల్ల కూడా జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు పెరుగుతున్నాయని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. భారతదేశం వైపు చెడు దృష్టితో చూసేవాళ్ల కళ్లు పీకేస్తామంటూ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు చెప్పారు. రక్షణ మంత్రులే అలాంటి ప్రకటనలు చేస్తే.. నగ్రోటా లాంటి ఉగ్రదాడులు జరగక తప్పదని, దీన్ని మనం ఊహించవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ''మనం యుద్ధం కావాలని అనుకోం. కానీ మన దేశంవైపు ఎవరైనా చెడు దృష్టితో చూస్తే మాత్రం, వాళ్ల కాళ్లు పెరికేసి, వాళ్ల చేతుల్లో పెడతాం. మనకు అంత శక్తి ఉంది'' అని పారికర్ ఇంతకుముందు అన్నారు. 
మరిన్ని వార్తలు