వికాస్‌ దూబే తల్లి సంచలన వ్యాఖ్యలు

4 Jul, 2020 12:35 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ముఠా జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై వికాస్ దూబే తల్లి సరళాదేవి స్పందించారు. పోలీసులు చనిపోయిన విషయాన్ని తాను టీవీలో చూసి తెలుసుకున్నానని ఆమె తెలిపారు. పోలీసులను చంపి తన కొడుకు చాలా చెడ్డపని చేశాడని, ఎనిమిది మంది పోలీసులను పొట్టనపెట్టుకున్న తన కుమారుడిని పోలీసులే చంపేయాలని కోరారు. పోలీసులకు అతడు ఎక్కడ ఉంటున్నాడో తెలిసినా ఎందుకు పట్టుకోవట్లేదని ఆమె ప్రశ్నించారు. వికాస్‌ తనంతట తాను లొంగిపోవాలని.. లేదంటే పోలీసులు తనను ఎన్‌కౌంటర్ చేయ్యాలని ఆమె కోరారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడిన తర్వాతే వికాస్ నేరస్తుడిగా మారాడని ఆమె తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచేందుకు మంత్రి సంతోశ్ శుక్లాను కూడా హతమార్చాడని అన్నారు.

నాలుగు నెలలుగా తన కుమారుడిని కలవలేదని సరళా దేవి చెప్పారు. ప్రస్తుతం ఆమె తన చిన్న కొడుకుతోనే లక్నోలో నివాసం ఉంటున్నానని అన్నారు. ఇదిలావుంటే.. వికాస్ దుబే ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేల నగదు ఇస్తామని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ ప్రకటించారు. కాన్పూర్ పరిధిలోని బికారు గ్రామంలో పోలీసు లైన్ వద్ద జరిగిన ఎన్‌కౌంటరులో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం నివాళ్లర్పించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు.(ఉత్తరప్రదేశ్‌లో ఘోరం)

వికాస్‌ దూబేని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై అతడి అనుచరులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. వారి ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. సాధారణ పౌరుడితో సహా ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. అనంతరం మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నేరస్తులను పోలీసులు హతమార్చారు. కాన్పూర్‌ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కరడుగట్టిన నేరగాడైన వికాస్‌ దూబేపై 60కి పైగా కేసులున్నాయి.

>
మరిన్ని వార్తలు