ఓ తల్లి ఆవేదన

31 May, 2015 12:43 IST|Sakshi
అరుదైన నాడీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆరుగురు సంతానంతో తల్లి తబసుమ్, తండ్రి నజీర్

'లోకంలో చాలామంది మగపిల్లల్నే కనాలనుకుంటారు. నాకు, మా ఆయనకు మాత్రం అమ్మాయి కావాలనుండేది. బహుషా ఈ రోజు నేను చనిపోవాలని కోరుకోవడానికి.. నా పిల్లల్ని చంపేయమని అడగలేక అడగడానికి బహుషా అదే కారణమేమో!

 

నాకిప్పుడు 36 ఏళ్లు. ఇంకో నాలుగైదు సంవత్సరాలకంటే ఎక్కువ కాలం బతకనని తెలుసు. నా ఒంట్లో శక్తిమొత్తం హరించుకుపోయింది. దాదాపు 14 ఏళ్ల నుంచి సరిగా నిద్రపోలేదు కూడా. బంధువులు చనిపోయినా, వాళ్లింట్లో పెళ్లిళ్లయినా నేను మాత్రం ఇల్లు కదలను. సొంత తమ్ముడి పెళ్లి కూడా నేను లేకుండానే జరిగిపోయింది..

సూర్యుడు బయటికిరాకముందే 18 ఏళ్ల నా పెద్దకొడుకు  సులేమ్ నిద్రలేచి అరుస్తూఉంటాడు.. టాయిలెట్కు తీసుకెళ్లమని! ఇల్లూడుస్తున్న చీపురును అక్కడే పడేసి వాణ్ని బాత్రూమ్ కి తీసుకెళతా. ప్యాంట్ విప్పి, మూత్రం పోయించి, శుభ్రంగా కాళ్లు కడుగుతా. నేనుగానీ ఇలా చెయ్యకుంటే వాడు పక్క తడిపేస్తాడు. కనీసం జిప్ తీసుకోవడం కూడా రాదు వాడికి. ఆ అలికిడికి 16 ఏళ్ల సుహేబ్కు మెలకువొస్తుంది. లేచింది మొదలు 'అమ్మా.. ఆకలి' అంటూ చంపుతాడు. బ్రషింగ్ చేయించేలోగా వాడి నానమ్మ పాలు, బిస్కెట్లు తినిపించడానికి రెడీ అవుతుంది. బిస్కెట్లు పాలలో పూర్తిగా నాననివ్వాలి. ఘనపదార్థాలను వాడు తినలేడు.

అంతలోనే అసిమ్ (14), ఖషిఫ్ (12) నిద్రలేచి పక్కమీదే అటూ ఇటూ దొర్లుతూఉంటారు. అలా దొర్లడంతప్ప కూర్చోవడం, నిల్చోవడం, అన్నం తినడంలాంటివి చేయలేరు. ఎనిమిదేళ్ల కవలలు అవాన్, తైబాలదీ ఇలాంటి పరిస్థితే. ఒకరితర్వాత ఒకరికి ఏదోఒక సేవ చేస్తుండగానే పొద్దుగూకుతుంది. కొద్దిగా కన్నంటుతుందోలేదో.. కాలకృత్యాలు తీర్చమని పిలుస్తారు.

పెద్దకొడుకు కుహేబ్ (20), చిన్నమ్మాయి ఉల్తాఫ్ (5) మాత్రం ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఆరుగురు కూడా మొదటి ఐదేళ్లవరకు బాగానే ఉన్నారు. ఆ తరువాతే వారిలో ఎదుగుదల లేకుండాపోయింది. ఒంట్లో సత్తువ ఉండదు. ఎక్కడపడితే అక్కడ కూలబడిపోతారు. వీళ్లకి నయం చేయించడానికి నేను, నా భర్త తిరగని ఊరంటూలేదు. నా ఆరుగురు పిల్లలకు అరుదైన నాడీ సంబంధిత వ్యాధి ఉందని డాక్టర్లు తేల్చారు. మరి నయమవుతుందా అంటే మాత్రం సరైన సమాధానం ఎవరూ చెప్పట్లేదు.

చాలామందైతే ఈ పిల్లలు బతకరని చెబుతున్నారు. ఈ మధ్యే మా బంధువులు కొందరు మరణభిక్షకు అర్జీ పెట్టుకోమని సలహా ఇచ్చారు. ఏం చెప్పను.. 'నా పిల్లల్ని చంపేయండి' అని ఏ తల్లైనా అనగలదా!' అంటూ విదారకంగా తన గాథ చెబుతోంది ఆగ్రాకు చెందిన తబసుమ్.

ఇస్లాం ధర్మం అంగీకరించినందున వరుసకు సోదరుడయ్యే మహమ్మద్ నజీర్తో 1995లో ఆమె పెళ్లయింది. ఆగ్రాలోని ఓ హల్వా దుకాణంలో పనిచేస్తోన్న నజీర్.. రోజుకు  250 రూపాయలు సంపాదిస్తాడు. తిప్పికొడితే ఇద్దరు పిల్లలకికూడా సరైన వైద్యపరీక్షలు చేయించేంత స్తోమతలేదు అతనికి. ఇక ప్రభుత్వ సహాయమంటారా.. గతంలో ఓసారి ఆగ్రా ఎమ్మెల్యే సూచనమేరకు ఆరుగురు పిల్లల్ని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వాతావరణం, వైద్యుల నిర్లక్ష్యం భరించలేక పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చుకున్నారు.

ఈ మధ్యే ముంబైకి చెందిన ఓ ఎన్జీవో పిల్లలకి నయం చేయిస్తామని ముందుకొచ్చింది. అయితే అంతదూరం పంపాలో లేదో తేల్చుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు. 'ఏ డాక్టర్లూ నా పిల్లలకు నయం చేయలేరు. అల్లా ఒక్కడే ఆ పని చేయగలడని నమ్ముతున్నా. ఒకవేళ అలా జరగకుంటే ఆయనే (దేవుడే) వాళ్ల ప్రాణాలు తీసేసుకుంటాడు. నేను మాత్రం  నాపిల్లలకు మరణభిక్ష పెట్టమని ప్రభుత్వాన్ని అడగదల్చుకోలేదు' అంటాడు 42 ఏళ్ల నజీర్.

మరిన్ని వార్తలు