'అమ్మ' సెంటిమెంట్ పండింది!

30 May, 2014 15:24 IST|Sakshi
'అమ్మ' సెంటిమెంట్ పండింది!
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అమ్మ ప్రేమ, ఆప్యాయతకు కరిగిపోని వారెవరూ ఉండరు. అమ్మ ప్రేమ అనే అంశంతో చిత్ర పరిశ్రమలో లెక్కలేనన్ని వచ్చాయి. అయితే చలన చిత్ర పరిశ్రమలో వచ్చిన సినిమాలను తలదన్నెలా రాజకీయ తెరపై అమ్మ ప్రేమను భారత ప్రధాని నరేంద్రమోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ లు పండించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు భగ్గుమనే స్థాయిలో ఉన్నాయనే కాదనలేని అంశం. ఇరుదేశాల మధ్య శతృత్వాన్ని పక్కనపెట్టి ప్రధానిగా మోడీ చేసే ప్రమాణస్వీకారానికి నవాజ్ షరీఫ్ హాజరయ్యారు. నరేంద్రమోడీతో షరీఫ్ సమావేశమైన నేపథ్యంలో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. 
 
ప్రధానిగా బాధ్యతల్ని చేపట్టేందుకు భారంగా గుజరాత్ వీడి.. దేశరాజధానికి వెళ్లే క్రమంలో తల్లి చెంత మోడీ కొద్ది క్షణాలు గడిపారు. మోడీపై తన తల్లి చూపించిన ప్రేమ, ఆప్యాయతను అన్ని టెలివిజన్ ఛానెల్స్ పోటీ పడి చూపించాయి.  టెలివిజన్ లో ప్రసారమైన తల్లి, కొడుకుల ఆప్యాయత కార్యక్రమం దేశ ప్రజల్నే కాకుండా పాకిస్థాన్ ప్రధాని తల్లిని కూడా కదిలించింది. ఇటీవల మోడీతో భేటి అయ్యాక భావోద్వేగానికి గురైన తల్లి గురించి షరీఫ్ చెప్పారు. 
 
నరేంద్రమోడీని ఆయన తల్లి మిఠాయిలు తినిపిస్తూ.. తల నిమురుతున్న దృశ్యాలు చూసి తన తల్లి కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని నవాజ్ షరీఫ్ తెలిపారు. నవాజ్ షరీఫ్ తల్లి భావోద్వేగానికి గురైన అంశాన్ని మోడీ ట్విట్టర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక భారత పర్యటన ముగించుకుని, తేలికపడ్డ మనసుతో సొంత దేశానికి ప్రయాణమైన నవాజ్ షరీఫ్ కు నరేంద్రమోడీ ఓ మంచి బహుమతి ఇచ్చారు. ఇద్దరి మధ్య తల్లికి సంబంధించిన విషయాల గురించి చర్చ వచ్చింది కాబట్టి, నవాజ్ షరీఫ్ తల్లికి ఓ మంచి శాలువాను మోడీ బహూకరించారు. తన తరఫున ఆమెకు ఇవ్వాలని మోడీ కోరారు. నరేంద్రమోడీ అందించిన బహుమతి చూసి నవాజ్ షరీఫ్ తల్లి,  కుమార్తె ఆనందపడిపోయారట. 
 
గతంలో ఇరుదేశాల దౌత్య సంబంధాల మధ్య ఉన్న దూరాన్ని క్రికెట్, శాంతియాత్రల అంశాలతో తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితాలను అందించలేదని విషయం విదితమే. కనీసం ఇరుదేశాల నేతలు, ప్రజల మధ్య అంతంత మాత్రమే ఉన్న సంబంధాలు 'తల్లి' సెంటిమెంట్ మాత్రం కొంత ఊరట కలిగించాయి. పాకిస్థాన్ ప్రధాని, శ్రీలంక అధ్యక్షుడికి ఆహ్వానం పంపడం వివాదస్పదమైనా.. మోడీ పెద్దగా పట్టించుకోకుండా ముందుకే పోయారు. దాంతో వివిధ దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ఓ అవగాహన కలిగేలా చర్చలు జరిపారు. ఆ చర్చల మధ్యలో తల్లి సెంటిమెంట్ ఇద్దరి నేతలను దగ్గరికి చేర్చిచింది. ఆ దూరం తగ్గడమనేది కేవలం రెండు దేశాల నేతలకే పరిమితం కాకుండా ఇరు దేశాల ప్రజలందరి మధ్య విభేధాలు తగ్గించాలని కోరుకుందాం!
>
మరిన్ని వార్తలు