అభ్యర్థులను తిరస్కరించే హక్కుండాలి: నరేంద్ర మోడీ

30 Jun, 2013 06:54 IST|Sakshi
అభ్యర్థులను తిరస్కరించే హక్కుండాలి: నరేంద్ర మోడీ

అహ్మదాబాద్/గాంధీనగర్: ఓటింగును తప్పనిసరి చేయడంతో పాటు అభ్యర్థులను తిరస్కరించే హక్కును కూడా ఓటర్లకు కల్పించాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గాంధీనగర్‌లో శనివారం ఏర్పాటైన యువనేతల సమావేశంలో ఆయన ఎన్నికల సంస్కరణలపై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగును తప్పనిసరి చేయడంతో పాటు అభ్యర్థులను తిరస్కరించే హక్కును ఓటర్లకు కల్పిస్తూ తమ ప్రభుత్వం బిల్లు ప్రవేశ పెట్టిందని చెప్పారు. అయితే, గవర్నర్ దానిని ఆమోదించలేదన్నారు. మంచివారిని రాజకీయాల్లోకి తెచ్చేందుకు ఓటింగును తప్పనిసరి చేయడం, అభ్యర్థులను తిరస్కరించే హక్కును ఓటర్లకు కల్పించడం వంటి ఎన్నికల సంస్కరణలు అవసరమని ఉద్ఘాటించారు. ప్రస్తుతం ఓటర్లు బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరో ఒకరిని వారి నేపథ్యంతో నిమిత్తం లేకుండా ఎన్నుకోవాల్సి వస్తోందని, తిరస్కరించే హక్కును కల్పించినట్లయితే అభ్యర్థుల్లో తగిన వారెవరూ లేకుంటే ఓటర్లు అందరినీ తిరస్కరించే అవకాశం ఉంటుందని వివరించారు. అలాంటి పరిస్థితి ఉంటేనే రాజకీయ పార్టీలు తప్పనిసరిగా మంచివారికి టికెట్లు ఇచ్చి, బరిలో నిలుపుతాయని చెప్పారు.

నల్లడబ్బు సృష్టికర్తలకు శిక్ష తప్పదు
దేశంలో నల్లడబ్బును సృష్టించే వారికి శిక్ష తప్పదని, ఆ సమయం ఆసన్నమవుతుందని మోడీ అన్నారు. నల్లడబ్బును సృష్టించే వారిని శిక్షించే అవకాశం దొరుకుతుందని తెలిపారు. ‘కరెన్సీ నల్లది కాదు.. ‘నల్ల’బుద్ధి ఉన్నవారి వల్లే నల్లడబ్బు పుడుతోంది’ అని మోడీ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్‌లో చార్టర్డ్ అకౌంటన్సీ విద్యార్థుల జాతీయ సమావేశంలో శనివారం ఆయన ఈ విధంగా మాట్లాడారు. నల్లడబ్బును అరికట్టడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు గణనీయమైన పాత్ర పోషించాలని మోడీ పిలుపునిచ్చారు.
 

మరిన్ని వార్తలు