అమృత్‌సర్‌ రైలు ప్రమాదం.. సిద్ధూ పెద్దమనసు

23 Oct, 2018 11:19 IST|Sakshi

ఆ పిల్లలందరినీ దత్తత తీసుకుంటా : సిద్ధూ

చంఢీగర్‌ : దసరా ఉత్సవాల్లో భాగంగా అమృత్‌సర్‌ నగర శివార్లలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ‘రావణ దహనం’ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వందలాది మంది ప్రజలు రైలు పట్టాలపై నిల్చుని రావణ దహనాన్ని వీక్షించే క్రమంలో రైలు వారిని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే 61 మంది దుర్మరణం చెందగా మరో 57 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంజాబ్‌ మాజీమంత్రి నవజోత్‌కౌర్‌ సిద్దూ హాజరయ్యారు. (‘మేడమ్‌..! 500 ట్రైన్‌లు వచ్చినా భయపడరు’)

నవజోత్‌కౌర్‌ కళ్లెదుటే ఈ ఘోర ప్రమాదం జరగడం దురదృష్టకరమని పంజాబ్‌ మంత్రి, ఆమె భర్త నవజోత్‌సింగ్‌ సిద్దూ విచారం వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలను దత్తత తీసుకుంటామని వెల్లడించారు. వారికి ఉన్నత విద్యాసంస్థల్లో చదువు చెప్పిస్తానని తెలిపారు. అలాగే, ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన మహిళలను ఆర్థికంగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా.. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తొలి విడతగా పంజాబ్‌ ప్రభుత్వం సోమవారం నష్టపరిహారాన్ని పంపిణీ చేసింది. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున 21 కుటుంబాలకు ఆర్థిక సాయం చేసినట్టు కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ మంత్రి బ్రామ్‌ మోహింద్రా తెలిపారు. మిగతా కుటుంబాలకు మరో రెండు రోజుల్లో నష్టపరిహారం అందిస్తామని అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

(చదవండి : అమృత్‌సర్‌ ప్రమాదం : సెల్ఫీల గోలలో పడి)

మరిన్ని వార్తలు