ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన

26 Jul, 2017 02:58 IST|Sakshi
ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన

లోక్‌సభలో సస్పెన్షన్‌పై.. రాజ్యసభలో రైతు సమస్యలపై..
న్యూఢిల్లీ: లోక్‌సభను మంగళవారం కూడా విపక్షాలు నిరసనతో హోరెత్తించాయి. సోమవారం తమ ఆరుగురు సభ్యులపై స్పీకర్‌ విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. నిరసనలతో ముఖ్య కార్యక్రమాలేవీ చేపట్టకుండానే సభ బుధవారానికి వాయిదాపడింది. అంతకుముందు సభ మొదలు కాగానే గోరక్షకుల దాడులపై చర్చకు విపక్షాలు పట్టుబట్టి వెల్‌లోకి దూసుకెళ్లాయి. నిరసనల మధ్య స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం తర్వాత సభ మళ్లీ మొదలైంది.

బీజేపీ ఎంపీలు వీరేంద్ర కుమార్, నందకుమార్‌ సింగ్‌ చౌహన్‌.. దళితుల విషయంలో నిరాధార ఆరోపణల చేసి తన ప్రతిష్టకు భంగం కలిగిం చారని కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిరాదిత్య సింధి యా చెప్పారు. ‘ఆ ఆరోపణలు రుజువైతే నేను ఎంపీగా తప్పుకుంటాను. వాటిని నిరూపించలేకపోతే వారిద్దరూ రాజీనామా చేసి, క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. ఆయనకు కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే మద్దతు తెలిపారు. పలువురు కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. అధికారపక్షం అభ్యంతరం చెప్పడంతో రభస మొదలైంది. మరోపక్క.. ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ రంగంలో సంక్షోభం నెలకొందని, రైతులు నష్టపోతున్నారని రాజ్యసభలో విపక్షాలు మండిపడ్డాయి. ఆహార ధాన్యాల ఎగుమతి, దిగుమతి సుంకాల నిర్ణయంలో భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్‌ ఆరోపించారు.  

పార్లమెంటు విశేషాలు..
ఐపీఎస్‌ల పదోన్నతికి శారీరక దారుఢ్యాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచి స్తున్నట్లు హోం శాఖ సహాయ మంత్రి కిరెన్‌ రిజిజు లోక్‌సభకు చెప్పారు. వీసా దరఖాస్తుదారుల నేరచరిత్రను తెలుసుకోవడానికి వీసా ఫార్మాట్‌ సవరణ ప్రక్రియ ప్రారంభించామన్నారు.
దేశ సరిహద్దు రక్షణపై ఆందోళనలను తొలగించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని రక్షణ శాఖ సహాయమంత్రి సుభాష్‌ భామ్‌రే వెల్లడించారు.
రద్దయిన రూ. 500, 1,000 నోట్ల నంబర్ల కచ్చితత్వాన్ని తెలుసుకోవడానికి ఆర్బీఐ ఆ నంబర్లను తనిఖీ చేస్తోందని ఆర్థిక మంత్రి జైట్లీ రాజ్యసభలో తెలిపారు.

మరిన్ని వార్తలు