‘పద్మావత్‌’ నిరసనలు హింసాత్మకం

24 Jan, 2018 20:22 IST|Sakshi

గుర్గావ్‌లో స్కూలు బస్సుపై రాళ్లదాడి

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనకారుల విధ్వంసం

గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గోవాల్లో చిత్ర ప్రదర్శన నిలిపివేత

జైపూర్‌/ముంబై/అహ్మదాబాద్‌: ‘పద్మావత్‌’ చిత్రం విడుదలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. హరియాణాలోని గుర్గావ్‌లో ఆందోళనకారులు ఓ స్కూలు బస్సుపై రాళ్లురువ్విన ఘటనలో అందులో ఉన్న విద్యార్థులు, టీచర్లు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలోని ఈ చిత్రం గురువారం దేశవ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. దీన్ని వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా పలుప్రాంతాల్లో  కర్ణిసేన, పలు హిందూ సంస్థల కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.

మాల్స్, సినిమా హాళ్లలో విధ్వంసం సృష్టించారు. చాలాచోట్ల హైవేలను దిగ్బంధించారు. గుర్గావ్, రాజస్తాన్‌ సహా ముంబై, నాసిక్, లక్నో, ఇండోర్‌ తదితర ప్రాంతాల్లో ఈ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. కాగా, ఈ సినిమాలో ఎలాంటి అభ్యంతరకర దృశ్యాల్లేవని చిత్ర బృందం మరోసారి స్పష్టం చేసింది. రాజ్‌పుత్‌ గౌరవాన్ని పెంచే దృశ్యాలే ఉంటాయని పునరుద్ఘాటించింది. కాగా, ఆందోళనల నేపథ్యంలో గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గోవాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోవటం లేదని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది.  

ఆస్తుల విధ్వంసం
పద్మావత్‌ చిత్రం విడుదలను వ్యతిరేకిస్తూ.. రాజస్తాన్, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీల్లో ఆందోళనలు మిన్నంటాయి. జైపూర్‌లో నిరసనకారులు రెండు బస్సులను ధ్వంసం చేశారు. రోడ్‌రోకోలతో రోడ్లపై నిరసన చేపట్టారు. ముంబై, నాసిక్‌లలోనూ నిరసనలు జరిగాయి. చిత్రం ప్రదర్శించేందుకు సిద్ధమైన మూడు మల్టీప్లెక్స్‌ల ముందు నిలిపి ఉంచిన 30 బైకులు, స్కూటర్లకు నిరసనకారులు నిప్పంటించారు. ఆందోళన నేపథ్యంలో శ్రీ రాజ్‌పుత్‌ కర్ణి సేన తీవ్రంగా మండిపడింది. మహారాష్ట్రలో చిత్ర ప్రదర్శనను అడ్డుకునేందుకు శివసేన మద్దతు తెలిపిందని కర్ణిసేన అధ్యక్షుడు లోకేంద్ర సింగ్‌ కాల్వీ వెల్లడించారు. చిత్రంలో రాణి పద్మావతి, అల్లావుద్దీన్‌ ఖల్జీ మధ్య శృంగార భరిత దృశ్యాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు.

చిన్నారులని చూడకుండా..!
గుర్గావ్‌.. మధ్యాహ్నం 3 గంటలవుతోంది. స్కూలు ముగించుకున్న విద్యార్థులను తీసుకుని జీడీ గోయెంకా స్కూలు బస్సు బయలుదేరింది. రోడ్డుపై ‘పద్మా వత్‌’ నిరసనకారులు రాస్తారోకో చేయటంతో వాహనాలన్నీ ఆగిపోయాయి. ఈ క్రమంలోనే ఓ ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. దాని ముందు న్న గోయెంకా స్కూలు బస్సుపై రాళ్లతో దాడిచేశారు. ఆ సమయంలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకున్న విద్యార్థులు, కొందరు టీచర్లు కూడా బస్సులో ఉన్నారు. రాళ్లదాడితో విద్యార్థులు భయంతో వణికిపోయారు. తప్పించుకునేందుకు అవకాశం లేకపోవటంతో ఏడు స్తూ సీట్లకింద నక్కారు. రోడ్డు పక్కనున్న వారు తీసిన వీడియోలో ఈ హృదయవిదారక దృశ్యాలు ఆవేదన కలిగించాయి.

మరిన్ని వార్తలు