రసాయన దాడులు చేద్దాం!

13 Jul, 2017 01:38 IST|Sakshi
రసాయన దాడులు చేద్దాం!

► హిజ్బుల్‌ ఉగ్రవాదుల వ్యూహం
► పాక్‌ నుంచి రసాయనిక ఆయుధాలు  


న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు పాకిస్తాన్‌ రసాయనిక ఆయుధాలను సమకూర్చుతోందన్న సంచలన సమాచారం తాజాగా వెలుగు చూసింది. నిఘా సంస్థల వద్దనున్న ఉగ్రవాదుల సంభాషణల ఆడియోటేపులను సంపాదించిన సీఎన్‌ఎన్‌–న్యూస్‌18 చానల్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంతకాలం గ్రెనేడ్లు, బాంబులు, తుపాకుల వంటి ఆయుధాల్ని వాడిన ఉగ్రవాదులు ఈసారి భారత ఆర్మీ ఊహించని రీతిలో రసాయనిక దాడి చేయాలని భావిస్తున్నారంది. గతకొన్ని నెలలుగా భారీ సంఖ్యలో ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టినందుకు ప్రతీ కారంగా ముష్కరులు రసాయనిక దాడికి తెగించేందుకు సిద్ధమవుతున్నారంది. ఇందు కు తనవంతు సాయంగా పాకిస్తాన్‌ వారికి ఆయుధాలను సమకూర్చుతోంది.

రసాయనిక ఆయుధాలు ఇప్పటికే ఉగ్రవాదులకు చేరినట్లుగా కూడా ఆడియో సంభాషణల్లో తెలిసింది. ‘పీర్‌ సాహెబ్‌ (లష్కరే తోయిబా చీఫ్‌ మహమ్మద్‌ సయీద్‌)కు నేను కావాలి. నా వాళ్లు కూడా నన్ను కోరుకుంటున్నారు. మన తర్వాతి కార్యక్రమం ఈద్‌ తర్వాత ఉంటుంది’ అని ఓ హిజ్బుల్‌ ఉగ్రవాది మాట్లాడాడు. ‘అల్లా దయతో మనకు పాకిస్తాన్‌ నుంచి భారీ మద్దతు లభిస్తోంది. సరిహద్దులో పనులు జరుగుతున్నాయి’ అని మరో ఉగ్రవాది అన్నాడు. మరో సందర్భంలో అదే ఉగ్రవాది మాట్లాడుతూ ‘ఇప్పటివరకు మనం బారత ఆర్మీపై గ్రెనేడ్లను విసిరాం. ముగ్గురు, నలుగురు మాత్రమే చనిపోయేవారు.

మన వ్యూహాలను మార్చాల్సిన సమయమిది. మనం రసాయనిక ఆయుధాలను వాడి ఒకే దాడిలో వీలైనంత ఎక్కువ మందిని చంపుదాం’ అని అన్నాడు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్‌ ప్రోత్సహిస్తోందనడానికి, ప్రేరేపిస్తోందనడానికి ఈ ఆడియో సంభాషణలు బలమైన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వార్తా కథనంపై బీజేపీ నేత ఆర్కే సింగ్‌ స్పందిస్తూ ‘పాక్‌ రసాయనిక ఆయుధాలను సమకూరుస్తున్నట్లయితే, అది యుద్ధానికి దారితీస్తుంది. హిజ్బుల్‌ చీఫ్‌ దీనిపై జాగ్రత్తగా ఆలోచించాలి’ అని అన్నారు.

హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కశ్మీర్‌లో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ. ప్రస్తుతం దాదాపు 200 మంది సభ్యులు క్రియాశీలకంగా ఉన్నారు. అమర్‌నాథ్‌ యాత్రి కులపై సోమవారం రాత్రి జరిగిన దాడిలోనూ హిజ్బుల్‌ ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యాత్రికులపై దాడి లష్కరే తోయిబా పనేనని పోలీసులు చెబుతున్నారు. ఈ ఆరోపణలను లష్కరే ఖండిం చింది. తమపై నిందలు వేస్తున్నారనీ, అది ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధంగా జరిగిన దాడి అని లష్కరే తెలిపింది.

మరిన్ని వార్తలు