సరిహద్దులో పాక్‌ కవ్వింపు చర్యలు..

13 Jun, 2020 16:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: సరిహద్దుల వెంబడి పాకిస్తాన్‌ పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ దేవేందర్‌ ఆనంద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఆరు నెలల్లో నియంత్రణ రేఖ వెంబడి మొత్తంగా దాదాపు 2 వేల సార్లు దాయాది దేశం కవ్వింపు చర్యలకు పాల్పడిందని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ మొదటి పది రోజుల్లో 114 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని వెల్లడించారు. ‘‘2020లో మొదటి ఆరు నెలల్లో 2 వేల సార్లకు పైగా పాక్‌ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. గతేడాది ఆర్టికల్‌ 370 రద్దు సమయంలోనూ పాక్‌ ఇలాంటి చర్యలకు పాల్పడింది. ఆనాటి నుంచి రోజు రోజుకీ ఈ గణాంకాలు పెరుగుతూనే ఉన్నాయి. గతేడాదితో 2020 తొలి అర్ధభాగంలోనే రికార్డు స్థాయిలో కాల్పుల ఉల్లంఘన జరిగింది ’’అని పేర్కొన్నారు.(పరోటాపై అధిక పన్నులు.. కేం‍ద్రం క్లారిటీ!)

కాగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత పదహారేళ్లతో పోలిస్తే 2019లో అత్యధిక సార్లు(3168) పాకిస్తాన్‌ కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. ఇక 2018లో ఈ సంఖ్య 1629గా నమోదైంది. ఇదిలా ఉండగా.. గత ఐదు రోజులుగా పూంచ్‌ సెక్టార్‌లో పాక్‌ బలగాలు సరిహద్దు గ్రామాల్లో మోర్టార్లు విసరడం సహా పదే పదే కాల్పులు జరుపుతున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. పూంచ్‌లోని షాపూర్‌, కిర్ణి, కస్బా సెక్టార్లలో పాక్‌ ఆర్మీ పోస్టులను ముందుకు జరిపిందని తెలిపాయి.  

మరిన్ని వార్తలు