పిరికిపందలే ఇలా దాడి చేస్తారు: రాజ్ నాథ్

28 Oct, 2016 15:26 IST|Sakshi
పిరికిపందలే ఇలా దాడి చేస్తారు: రాజ్ నాథ్

న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్ చర్యలపై  కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. గ్రేటర్ నోయిడాలో ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్(ఐటీబీపీ) 55వ వ్యవస్థాపక దినోత్సవంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. భారత్ ను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆశ్రయించడాన్ని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. దాయాది దేశం ఎప్పుడూ ఇదే తరహాలో ఉగ్రచర్యలకు పాల్పడుతుందని, పిరికివాళ్లే టెర్రరిజాన్ని ఆయుధంగా చేసుకుని దాడులు చేస్తారని అన్నారు. ధైర్యవంతులు ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడరని, పాక్ మాత్రం భారత్ ను ఏదో రకంగా దెబ్బతీయాలని విశ్వప్రయత్నాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ సక్సెస్ సాధిస్తున్న దేశాలలో భారత్ ఒకటని రాజ్ నాథ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న జమ్ముకశ్మీర్ ఉడీలో ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి తర్వాత పాక్ తన దాడులను మరింతగా కొనసాగిస్తుందని చెప్పారు. పాక్ పై భారత ఆర్మీ మొదటగా కాల్పులు జరపదని, ఒకవేళ దాయాది దేశం దాడులకు పాల్పడితే మాత్రం ధీటుగా జవాబిస్తామని రాజ్ నాథ్ తెలిపారు. భారత్‌ అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి విషయంపై మీడియా ప్రశ్నించగా.. ప్రభుత్వం ఈ తప్పక చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. జమ్ముకశ్మీర్ లోని పూంఛ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ వద్ద శుక్రవారం వేకువజామున బీఎస్ఎఫ్ బలగాలు జరిపిన దాడిలో ఏకంగా 15 మంది పాక్ జవాన్లు హతమైన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు