‘పాక్ జిందాబాద్’ అని అన్నారు!

17 Mar, 2016 02:07 IST|Sakshi
‘పాక్ జిందాబాద్’ అని అన్నారు!

భారత్‌ను నాశనం చేస్తామనే నినాదాలూ చేశారు
♦ బయటి వ్యక్తులు వర్సిటీలో అలజడి సృష్టించారు.. కన్హయ్య,
♦ ఖాలిద్, అనిర్బన్‌ను బహిష్కరించండి: ‘జేఎన్‌యూ’పై నివేదిక
 
 న్యూఢిల్లీ: జేఎన్‌యూలో జరిగిన వివాదాస్పద కార్యక్రమంలో బయటి వ్యక్తులు ‘భారత్‌ను నాశనం చేస్తాం’, ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే రెచ్చగొట్టే నినాదాలు చేసినట్లు అత్యున్నతస్థాయి విచారణ కమిటీ తేల్చింది. ఫిబ్రవరి 9న జరిగిన ఈ కార్యక్రమం వీడియో ఫుటేజీలో ‘భారత్ నాశనమయ్యేంత వరకు పోరాటం చేస్తాం’ అనే నినాదాలు కనిపించలేదని, అయితే ప్రత్యక్షసాక్షులు మాత్రం వాటిని ధ్రువీకరించారని స్పష్టంచేసింది. ‘భారత్‌ను ముక్కలు ముక్కలు చేస్తాం’ అని నినదించారన్న దాని గురించి కమిటీ నివేదికలో ప్రస్తావించలేదు. వర్సిటీ ప్రొఫెసర్ రాకేశ్ భట్నాగర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ ఈ నివేదికను రూపొందించింది.

కార్యక్రమ నిర్వాహకులు బయటి వ్యక్తులను తీసుకురావడం, వారు రెచ్చగొట్టే నినాదాలు చేయడం దురదృష్టకరమంది. వీరి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల వర్సిటీ వాతావరణం ఉద్రిక్తంగా మారిందని, వీరు జేఎన్‌యూకు అపకీర్తి తెచ్చిపెట్టారని తెలిపింది. ఉమర్ ఖాలిద్, అనిర్బన్ భట్టాచార్యలు విద్యార్థుల్లో సామరస్యతను దెబ్బతీశారంది. అయితే కన్హయ్యపై ఎలాంటి అభియోగాలు పేర్కొనలేదు. ఏబీవీపీ సభ్యుడు సౌరభ్ శర్మ వర్సిటీలో ట్రాఫిక్‌కు అవరోధం కల్పించారని నిందించింది. కార్యక్రమానికి అనుమతి నిరాకరించినప్పటికీ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగానే దీన్ని నిర్వహించారని ఆక్షేపించింది.

బయటి వ్యక్తులను నియంత్రించడంలో వర్సిటీ భద్రతా విభాగం విఫలమైందని ఎత్తిచూపింది. కన్హయ్య కుమార్ ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చారని, కార్యక్రమానికి అధికారులు అనుమతి నిరాకరించడాన్ని ఆయన వ్యతిరేకించారని పేర్కొంది. కార్యక్రమ ముఖ్య నిర్వాహకుల్లో ఉమర్  ఒకరని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని, సెక్యూరిటీ వారికిష్టమొచ్చినట్లు చేసుకోవచ్చని ఆయన అధికారులకు స్పష్టంచేసినట్లు తెలిపింది.  ఈనెల 11న సమర్పించిన నివేదికలో కన్హయ్య, ఉమర్,  భట్టాచార్యతోపాటు మరో ఇద్దరిని బహిష్కరించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. వర్సిటీ వీసీ ఇప్పటికే 21 మంది విద్యార్థులకు షోకాజ్ నోటీసు ఇవ్వగా, వివరణకు ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. దీంతో తాజాగా గడువును ఈనెల 18 వరకు పొడిగించారని అధికారులు చెప్పారు.

>
మరిన్ని వార్తలు