పెజావర స్వామీజీ  కన్నుమూత

29 Dec, 2019 09:56 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి (88) కన్నుమూశారు.మణిపాల్‌ కస్తూర్భా హాస్పిటల్‌లో చికిత్స పొందిన స్వామీజీ అపస్మారక స్థితికి చేరడంతో డాక్టర్లు తెల్లవారుజామున మఠానికి తరలించారు. అక్కడే చివరివరకు చికిత్సను అందజేశారు. అశేష భక్తులను దుఃఖసాగరంలో ముంచుతూ శివైక్యం చెందారు స్వామి విశ్వేశతీర్థ. స్వామీజీ తుదిశ్వాస విడిచినట్టు ఉడిపి ఎమ్మెల్యే కె.రఘుపతి భట్ ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి ఉదయమే శ్రీకృష్ణమఠానికి చేరుకున్నారు. ఉడిపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి.

కాగా శ్వాస పీల్చుకోవడం ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెల 20న విశ్వేశ తీర్ధ స్వామీజీని ఆసుపత్రికి తరలించారు. తొలుత న్యుమోనియా సమస్యలకు చికిత్స అందించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం మరింత విషమంగా మారిందని, బ్రెయిన్ డిస్‌ఫంక్షన్ అని పరీక్షలో తేలిందని, ఇంకా స్పృహలోకి రాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో స్వామీజీ అభిమతం మేరకు లైఫ్ సపోర్ట్‌తోనే ఉదయం మఠానికి తరలించారు. 
 
పెజావర మఠాథిపతి విశ్వేశ తీర్ధ స్వామీజీ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్వామీజీ మృతిపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ విషాదం నుంచి స్వామీజీ అశేషభక్తులు కోలుకునేలా మానసిక స్థైర్యం కలిగించాలని ఆ కృష్ణ భగవానుని కోరుకుంటున్నానని అన్నారు. 

విశ్వేశ తీర్థ పరమపదించడం హిందూ జాతికి తీరని లోటు

ఉడిపిలో పెజావర్ మఠాధిపతి విశ్వేశ తీర్థ పరమపదించడం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర విచారం వ్యక్తం చేశారు. విశ్వేశ తీర్థ మరణం హిందూ జాతికి తీరని లోటన్నారు. హిందూ సమాజం గర్వించదగ్గ మత గురువుల్లో ఆయన ఒకరని గుర్తు చేసారు. శ్రీమద్వాచార్యుని ప్రధాన శిష్యులు అధోక్షజ తీర్థ నుంచి వేదాంతంపై సంపాయించిన పట్టుతో హిందూ ధర్మ పరిరక్షణకు విశ్వేశ తీర్థ పాటుపడ్డారని కొనియాడారు. బెంగుళూరులో పూర్ణప్రజ్ఞ విద్యాపీఠాన్ని ఏర్పాటు చేసి 63 సంవత్సరాలుగా వేదాంతంలో ఎంతోమంది స్కాలర్స్ ను తయారు చేసారని, శ్రీ మద్వాచార్యులు స్థాపించిన ద్వైత పాఠశాలతోనూ విశ్వేశ తీర్థకు అనుబంధముందని గుర్తు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు