సంస్కరణల వల్లే మెరుగైన ర్యాంకు

5 Nov, 2017 02:20 IST|Sakshi

‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ర్యాంకుపై ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: సులభతర వ్యాపార నిర్వహణ(ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో భారత్‌ ర్యాంకు మెరుగుపడడంపై కాంగ్రెస్‌ విమర్శల్ని ప్రధాని మోదీ తోసిపుచ్చారు. ఒకప్పుడు ప్రపంచ బ్యాంకుతో కలిసి పనిచేసిన వారే ఇప్పుడు ఆ సంస్థ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో శనివారం నిర్వహించిన ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్‌ను పెట్టుబడులకు గమ్యస్థానంగా అభివర్ణించారు. గత మూడేళ్లలో కేంద్రం చేపట్టిన సంస్కరణల వల్లే ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో భారత్‌ ర్యాంకు 30 స్థానాలు మెరుగుపడి 100వ ర్యాంకులో నిలిచిందని చెప్పారు.

జీఎస్టీతో పాటు ఇతర అన్ని సంస్కరణల ఫలితాల్ని కూడా ప్రపంచ బ్యాంకు పరిగణనలోకి తీసుకుంటే వచ్చే ఏడాది నుంచి ర్యాంకింగ్‌ మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత సంస్కరణల్ని ఇంతకుముందే అమలు చేసి ఉంటే రేటింగ్‌ ఎప్పుడో మెరుగుపడి ఉండేదని గత ప్రభుత్వాల పనితీరును పరోక్షంగా తప్పుపట్టారు. దేశంలోని 125 కోట్ల ప్రజల జీవితాల్లో మార్పు తేవడం కోసం ‘ఒన్‌ లైఫ్, ఒన్‌ మిషన్‌’ లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పారు.   జీఎస్టీపై చిన్న వ్యాపారస్తులు చేసిన పలు సూచనల్ని మంత్రుల బృందం ఆమోదించిందని, వచ్చే వారం జీఎస్టీ మండలి సమావేశాల్లో ప్రకటన వెలువడవచ్చన్నారు.  మే, 2016 వరకూ అమలు చేసిన సంస్కరణల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని 2017 సంవత్సరం ర్యాంకుల్ని ప్రకటించారన్నారు.

మరిన్ని వార్తలు