ఔరా! ఆవు కథ

14 Jun, 2016 09:23 IST|Sakshi
ఔరా! ఆవు కథ

అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక వ్యక్తి ఒక ఆవు ఉండేది. అది ఒక రోజు ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయింది.  అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది. చాలాసేపటి తర్వాత గాని ఆవు బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు ఆ యజమాని. ఇన్నాళ్లుగా తనకి ఎంతో సేవ చేసిన ఆవును కాపాడాలని అతను అనుకోలేదు. ఎందుకంటే అది ముసలిది. అంతేకాక ఆ బావిని కూడా మూసేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపటం మంచిదని భావించాడు. ఆ పని చేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు.

అతను పారతో బావిలోని ఆవుపై మట్టి వేయడం ప్రారంభించాడు. పక్కింటివారు కూడా పారలతో మట్టి వేస్తూ ఆయనకు సహాయం చేయసాగారు. ఏం జరుగుతోందో అర్ధం కాని ఆవు మొదట అంబా అరిచింది, తరువాత అరవకుండా ఉండిపోయింది. హమ్మయ్య ఆనుకున్నాడు. కొద్దిసేపు పారతో మట్టి వేసిన తరువాత బావిలోకి చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు. తనపైన మట్టిపడుతున్న ప్రతిసారి ఆవు మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టిమీదే నిలబడి పైకి రాసాగింది. బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి ఆవు పైకి వచ్చేసింది. ఆవు తెలివికి మెచ్చిన అతడు తన తప్పు తెలుసుకొని అప్పటి నుంచి ప్రేమగా చూడసాగాడు.  ఇది వాట్సప్ లో చక్కర్లు కొడుతున్న కథ.

దీనికి వ్యతిరేకంగా జరిగిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ లో సోమవారం చోటు చేసుకుంది.  ఓ ఆవు 35 అడుగుల లోతున్న బావిలోకి పడిపోయింది. అయితే దాన్ని అలాగే వదిలేయాలని అక్కడి వారు అనుకోలేదు. బావిలో చిక్కుకుపోయిన మూగజీవిని ఎలాగైనా రక్షించాలనుకున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహకారంలో దాన్ని బావిలోంచి బయటకు తీశారు. తాళ్ల సహాయంలో ఆవును బావిలోంచి బయటకు లాగారు. సాధు జంతువు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మూగజీవాల మట్ల మనుషులకు మమకారం తగ్గలేదనడానికి ఈ ఉదంతం అద్దం పట్టింది.

>
మరిన్ని వార్తలు