అమెరికన్‌ టూరిస్ట్‌ హత్య : కీలకంగా మారిన పుస్తకం

23 Nov, 2018 11:34 IST|Sakshi

పోర్ట్‌ బ్లేయర్‌ : అండమాన్‌, నికోబార్‌ దీవుల్లోని సెంటినెలీస్‌ తెగ ప్రజల చేతిలో జాన్‌ అలెన్‌ అనే అమెరికన్‌ టూరిస్ట్‌ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జాన్‌ మృతదేహం కోసం అండమాన్‌, నికోబార్‌ పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో జాన్‌ మృతదేహాన్ని గుర్తించడం కోసం ఆంత్రోపాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, అటవీ శాఖ, విద్యావేత్తలు, రాష్ట్ర గిరిజన సంక్షేమ విభాగాల నిపుణుల సాయం తీసుకుంటున్నట్లు నార్త్‌ అండమాన్‌, నికోబార్‌ దీవుల డీజీపీ దీపేంద్ర పఠాక్‌ తెలిపారు. ఈ సందర్భంగా జాన్‌ రాసిన 13 పేజీల జర్నల్‌ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉందని పఠాక్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాక సెంటినెలీస్‌ మనుషులు జాన్‌ని బాణాలు, విల్లుల వంటి సంప్రదాయ ఆయుధాలతోనే చంపి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

జాన్‌ అండమాన్‌, నికోబార్‌ దీవుల్లోని సెంటినెల్‌ తెగ ప్రజలను కలిసి, వారిని క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ఇండియా వచ్చాడు. ఈ క్రమంలో వారిని కలుసుకునేందుకు ప్రతి రోజు ఆ దీవి దగ్గరకు వెళ్లేవాడు. ఇందుకు గాను జాన్‌ అలెగ్జాండర్‌ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో జాన్‌ తన అనుభావాల గురించి రాసి పెట్టుకునేవాడు. దీనిలో తనను ఇక్కడకు వెళ్లడానికి అనుమతిచ్చిన తల్లికి, దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. తాను ఆ దీవి వద్దకు క్షేమంగా చేరినట్లు.. వారితో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్లు రాసుకొచ్చాడు. తాను మరణించే ముందు రోజు వరకూ కూడా జాన్‌ తన అనుభవాలను రాసి పెట్టుకున్నాడు. జాన్‌ మరణం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన అలెగ్జాండర్‌, ఈ జర్నల్‌ని కూడా పోలీసులకు అందచేశాడు.

జాన్‌ మరణించినట్లు తొలుత గుర్తించిన వ్యక్తి అలెగ్జాండర్‌. నవంబర్‌ 17న కొందరు వ్యక్తులు ఒక మనిషిని సముద్రం ఒడ్డున పూడ్చిపెట్టడం చూసిన అలెగ్జాండర్‌ మృతదేహానికి ఉన్న బట్టలను బట్టి చనిపోయిన వ్యక్తిని జాన్‌గా గుర్తించాడు. అనంతరం ఈ విషయం గురించి అమెరికాలో ఉన్న జాన్‌ స్నేహితుడు బాబి పార్క్స్‌కు తెలియజేశాడు. బాబి ఈ విషయాన్ని జాన్‌ తల్లికి చెప్పగా ఆమె అమెరికా కాన్సులేట్‌కి తెలియజేసింది. అమెరికా కాన్సులేట్‌ అధికారులు ఈ విషయం గురించి భారత అధికారులకు తెలియజేయడంతో నవంబర్‌ 19న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జాన్‌ని నిషేధిత ప్రాంతంలోకి తీసుకెళ్లినందుకు గాను జాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న అలెగ్జాండర్‌తో పాటు మరో ఆరుగురు చేపలు పట్టే వ్యక్తులను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారందరి మీద హత్యా నేరం నమోదు చేశారు.

మరిన్ని వార్తలు