వరవరరావు హార్డ్‌డిస్క్‌ డేటా రికవరీ కోసం..

27 Dec, 2019 03:12 IST|Sakshi

ఎఫ్‌బీఐ సాయం కోరనున్న పుణే పోలీసులు

పుణే: ఎల్గార్‌ పరిషద్‌– మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన విరసం నేత వరవరరావు ఇంట్లో స్వాధీనంచేసుకున్న హార్డ్‌డిస్క్‌లోని డేటా రికవరీ కోసం అమెరికాకు చెందిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) సాయం తీసుకోవాలని పుణే పోలీసులు భావిస్తున్నారు. గతేడాది ఆగస్టులో వరవరరావు ఇంట్లో సోదాల్లో లభ్యమైన హార్డ్‌డిస్క్‌లో ఏముందో తెల్సుకునేందుకు నాలుగు ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీలకు పంపినా ఫలితం లేదు.

తొలుత పుణేలోని ల్యాబొరేటరీకి పంపగా, నిపుణులు హార్డ్‌ డిస్క్‌లోని డేటాను రికవరీ చేయలేకపోయారని ఓ అధికారి చెప్పారు. తర్వాత ముంబైలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి పంపినా అక్కడి నిపుణులు డేటా సంపాదించలేకపోయారు. గుజరాత్, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీల నిపుణులు రికవరీ చేయలేకపోయారని పేర్కొన్నారు. ‘సాంకేతికతలో ఎఫ్‌బీఐ చాలా పురోగతి చెంది ఉంటుంది. అందుకే ఎఫ్‌బీఐకి హార్డ్‌ డిస్క్‌ పంపాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు అవసరమైన అనుమతులను కేంద్ర హోం శాఖ ఇచ్చింది’అని ఆ అధికారి చెప్పారు.

మరిన్ని వార్తలు